జగన్ రెడ్డి ప్రతి సారి మంగళవారం తాడేపల్లికి వస్తారు. ఈ వారం బుధవారం వచ్చారు. శుక్రవారం తిరుగు ప్రయాణం ఉంది. అందుకే గురువారం ఐదుగురు నెల్లూరు కార్పొరేటర్లు తాడేపల్లికి వచ్చారు. వారిని అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నెల్లూరులో వైసీపీకి మిగిలిపోయిన ఒకే ఒక్క రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. ఆ ఐదుగురికి జగన్ తో కండువాలు కప్పించారు. టీడీపీకి షాక్ అని మీడియాలో ప్రచారం చేయించారు. తీరా చూస్తే ఆ ఐదుగురు ఎవరంటే వైసీపీ కార్పొరేటర్లే. తమ వారికి కండువాలు కప్పి.. తామే సంబరాలు చేసుకున్నారు జగన్, అనిల్.
నెల్లూరులో టీడీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేడు !
గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఈ కారణంగా నెల్లూరు కార్పొరేషన్ టీడీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. కానీ ఇప్పుడు వైసీపీలో చేరిన ఐదుగురు.. టీడీపీ కార్పొరేటర్లు ఎలా అయ్యారు?. జగన్ రెడ్డి నిర్వాకాల కారణంగా వైసీపీ నేతలంతా వైసీపీకి జెల్లకొట్టి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. కార్పొరేటర్లు ఎక్కువ మంది వారి అనుచరులే. వారితో పాటు కార్పొరేటర్లు కూడా పార్టీ మారిపోయారు. చివరికి మేయర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ ను పదవి నుంచి తప్పించడానికి డిప్యూటీ మేయర్ నేతృత్వంలో అవిశ్వాస నోటీసు ఇచ్చారు.
రాజీనామా చేసిన మేయర్ తప్ప దిక్కులేని వైసీపీ
నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేసి జగన్ పై విమర్శలు గుప్పించారు. అంతకు ముందు కోటంరెడ్డి సాయంతో మేయర్ పదవి పొందారు. ఆయన రాజీనామా చేసినప్పుడు కలసి రాకపోవడంతో కోటంరెడ్డి పట్టించుకోవడం మానేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ కోటంరెడ్డితో లాబీయింగ్ చేసుకుని పదవి నిలుపుకున్నారు. ఇటీవల డబుల్ గేమ్ ఆడుతూండటంతో.. డిప్యూటీ మేయర్ రవికుమార్ ఆమెను పదవి నుంచి తప్పించాలని తన వర్గం కార్పొరేటర్లో అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. వైసీపీకి రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన మేయర్ ను కాపడటానికి..మిగిలిపోయిన కార్పొరేటర్లకు కండువాలు కప్పుతున్నారు.
రేపు మేయర్ పీఠం నిలబడకపోతే పరువుపోదా ?
నెల్లూరులో ఇప్పుడు వైసీపీ పంచన పది మంది కార్పొరేటర్లు అయినా ఉన్నారో లేదో స్పష్టత లేదు. ఇవాళ కండువా కప్పించుకున్న వారు రేపు వైసీపీకి మద్దతుగా మేయర్ ఎన్నికల్లో ఓటేస్తారో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ తమ పార్టీకి చెందిన వారికి తమ పార్టీ కండువా కప్పి వారు వైసీపీలో చేరారోచ్ అని పండగ చేసుకోవడం వారి అల్ప సంతోషానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. కనీసం ఇతర పార్టీల వారిని చేర్పించుకుని అయినా.. ఇలా చేయవచ్చు కానీ తమ పార్టీ వారిని ఐదుగుర్ని బుజ్జగించి తిరిగి తీసుకు వచ్చి పార్టీలో చేర్చుకుని.. సంతోషపడుతున్నారు. వీరి పదవులు ఉంటుందో ఊడుతుందో.. 18వ తేదీన తెలుస్తుంది. ఆ రోజున మేయర్ పై అవిశ్వాసం పెట్టనున్నారు.