కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకు వస్తోంది. వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పని చేసిన చిన అప్పన్న కేలవం పీఏ మాత్రమే కాదని ఆయన బినామీ అని గుర్తించారు. అప్పన్న నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు తల్లిదండ్రులు కూడా లేరు.కానీ ఆయన పేరు మీద.. ఢిల్లీలో ఉన్న బ్యాంక్ అకౌంట్లలో ఐదు కోట్ల రూపాయల వరకూ నగదు ఉంది. అలాగే విశాఖలో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఆయన అధీనంలో లేవు. బ్యాంకు ఖాతాలు అప్పన్న పేరు మీదనే ఉన్నా.. వాటి నిర్వహణ ఆయన చేతుల్లో లేదు.అలాగే ఆస్తులు కూడా ఆయన అధీనంలో లేవని సీబీఐ సిట్ గుర్తించింది.
నెయ్యి కల్తీ వ్యవహారంలో కేజీకి పాతిక రూపాయల కమిషన్ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ వాటాలు అడిగితే ఆ విషయాన్ని కంపెనీ.. టీటీడీ చైర్మన్ కు చెబుతుంది.కానీ ఇక్కడ చెప్పిందో లేదో తెలియదు.. అడిగింది టీటీడీ చైర్మన్ అనే క్లారిటీ వారికి వచ్చింది. భోలేబాబా కమిషన్ ఇవ్వకపోవడంతో.. ప్రీమియర్ ను రంగంలోకి తెచ్చారు. అందు కోసం.. భోలేబాబా కంపెనీపై విచారణలు చేయించారు. ఓ పీఏ ఇదంతా చేయించడం సాధ్యం కాదు. పర్సనల్ అసిస్టెంట్ ను ముందు పెట్టి సుబ్బారెడ్డి చేయించారని అర్థం చేసుకోవచ్చు.
సీబీఐ సిట్ ప్రస్తుతానికి అప్పన్న చేశాడన్న దగ్గరే ఉన్నారు. ఆయన ఆస్తుల వివరాలు తీసుకున్నారు. మొత్తం గుట్టు రట్టు చేసేందుకు సుబ్బారెడ్డిని విచారణకు పలవనున్నారు. సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా తాజా దర్యాప్తు వెల్లడిస్తోంది. అప్పన్న పేరు మీద బ్యాంక్ అకౌంట్లలో ఉన్న కోట్ల నగదు.. ఆయన పేరు మీదకు విశాఖలో వచ్చిన ఆస్తుల గురించి లోతుగా బయటకు తీస్తే అసలు వ్యక్తుల సంగతి బయటకు వస్తుంది. అప్పుడు అసలు కథ అందరికీ తెలుస్తుంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                