తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా జహీరాబాద్ అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలలో భాగంగా, జహీరాబాద్‌లో రూ. 2,361 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా అభివృద్ధి చెందుతున్న ఈ స్మార్ట్ సిటీ, రాబోయే రోజుల్లో పటాన్చెరు, ఆదిభట్ల తరహాలో అత్యంత కీలకమైన రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా సుమారు 1.74 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా, రూ. 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
మొత్తం 12,500 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ ప్రాజెక్టును ప్లాన్ చేయగా, తొలి దశలో 3,245 ఎకరాలను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తికాగా, పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం NICDIT జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వంటి దిగ్గజ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పబోతున్నాయి. ఈ పారిశ్రామిక వృద్ధి నేరుగా నివాస మరియు వాణిజ్య స్థలాల డిమాండ్‌ను పెంచుతోంది.
జహీరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణం దాని భౌగోళిక కనెక్టివిటీ . ఇది ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారి కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా, రీజినల్ రింగ్ రోడ్డు కు 10 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు కు 65 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఇన్వెస్టర్లకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రతిపాదిత ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కూడా ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి అదనపు బలాన్ని ఇస్తోంది. దీంతో ఐదేళ్ల క్రితం సాదాసీదాగా ఉన్న ఇక్కడి భూముల ధరలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
ఒకప్పుడు కేవలం వ్యవసాయ ఆధారితంగా ఉన్న జహీరాబాద్, ఇప్పుడు నిమ్జ్ , స్మార్ట్ సిటీ పుణ్యమా అని మినీ హైదరాబాద్ గా రూపాంతరం చెందుతోంది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములు పోను, చుట్టుపక్కల గ్రామాల్లో వెలుస్తున్న ప్రైవేట్ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులు ఇక్కడి రియల్ ఎస్టేట్ బూమ్‌కు నిదర్శనం.
