రాజమౌళి

తెలుగు చలనచిత్రరంగంలో అపజయమంటూ లేని ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన ఇంతవరకు తీసిన తొమ్మిది చిత్రాలూ సూపర్ డూపర్ హిట్లే కావటం విశేషం. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల రాజమౌళి. తండ్రి విజయేంద్రప్రసాద్ పలు చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి రాజమౌళికి వరసకు అన్నయ్య అవుతారు. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా, విజయేంద్రప్రసాద్ అన్నదమ్ములే. సంగీత దర్శకులు కళ్యాణీ మాలిక్, శ్రీలేఖ కూడా శివశక్తిదత్తా సంతానమే.

రాజమౌళి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావువద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. రాఘవేంద్రరావు తీసిన టెలీసీరియల్ శాంతినివాసంతాలూకు చాలా ఎపిసోడ్‌లు రాజమౌళి దర్శకత్వంలో రూపొందాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ జూనియర్ ఎన్టీయార్ హీరోగా తలపెట్టిన స్టూడెంట్ నం.1 చిత్రానికిగానూ రాజమౌళికి తొలి అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు. ఆచిత్రానికి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి దర్శకత్వం వహించారు. స్టూడెంట్ నంబర్.1 చిత్రం ఘనవిజయం సాధించి జూనియర్ ఎన్టీఆర్‌కు, రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2003లో రాజమౌళి సొంతంగా సింహాద్రి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆచిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

సింహాద్రి తర్వాత రాజమౌళి నితిన్‌తో సై చిత్రాన్ని తీశారు. జెనీలియా, రాజీవ్ కనకాల ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 2005లో ప్రభాస్‌తో ఛత్రపతి చిత్రాన్ని తీశారు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగుతుంది. శ్రియ ఈ చిత్రంలో హీరోయిన్. 2006లో రవితేజ, అనూష్కశెట్టితో విక్రమార్కుడు చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. ఈ చిత్రాన్ని హిందీలోకికూడా రీమేక్ చేశారు. 2007లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్‌-రాజమౌళి కాంబినేషన్‌లో చిత్రం వెలువడింది. యమలోకం నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రం యమదొంగలో మోహన్‌బాబు కీలకపాత్ర పోషించారు. 2009లో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి తనయుడు చరణ్‌ హీరోగా మగధీర చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. ఆ చిత్రం తెలుగు చలనచిత్రరంగంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 2010లో హాస్యనటుడు సునీల్ హీరోగా మర్యాదరామన్న చిత్రం తీశారు. సలోని హీరోయిన్‌గా నటించారు. 2012లో ఈగ చిత్రాన్ని రూపొందించారు. నాని, సమంత హీరో హీరోయిన్‌లుగా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనేకాక డబ్ చేయబడిన తమిళ, హిందీ తదితర భాషలన్నింటిలోకూడా ఘన విజయాన్ని సాధించింది.

2012నుంచి రాజమౌళి బాహుబలి చిత్రంపై పనిచేస్తున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రాణా, నాజర్, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా ఉన్న ఈ చిత్రం నిర్మాణదశలోనే తీవ్ర ఆసక్తిని, అంచనాలను రేకెత్తిస్తోంది. రు.300కోట్ల వ్యయంతో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్నఈ చిత్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిభాగం 2015 జులైలో విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రం డబ్బింగ్ హక్కులను తీసుకుని హిందీలో విడుదల చేస్తున్నారు. రాజమౌళి అన్ని చిత్రాలకులాగానే కీరవాణే ఈ చిత్రానికికూడా సంగీత దర్శకుడు.

రాజమౌళి స్టూడెంట్ నం.1 చిత్ర నిర్మాణ సమయంలో రమ అనే ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. రాజమౌళి భార్య రమ, కీరవాణి భార్య శ్రీవల్లి అక్కా చెల్లెళ్ళు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]