ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడంతోపాటు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని బుధవారం సమన్లు జారీ చేయడంతో సీఎస్, డీజీపీ అత్యవసరంగా భేటీ అయి చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసీకి ఇచ్చే వివరణపై వీరిద్దరూ సచివాలయంలో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న అల్లర్లపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. అయితే, ఈ అల్లర్లకు కారణం ఏంటన్న దానిపై అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారనేది చర్చనీయాంశం అవుతోంది. అల్లర్లకు ఎవరిని బాధ్యులను చేయనున్నారు..? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఈ అల్లర్లను సాకుగా చూపి ఇదంతా ఈసీ వైఫల్యమేనని.. అవగాహనా లేని అధికారులను నియమించి అల్లర్లకు కారణం అయిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఉన్నతాధికారులను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట సీఎస్ , డీజీపీ హాజరై ఎలాంటి సమాధానం ఇస్తారు..? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
రాష్ట్రం అగ్నిగుండంగా మారిన… సీఎస్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ఇప్పుడు ఎవరిని బలి చేయనున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.