రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్, 2021లో రఘురామ కృష్ణంరాజు అరెస్టు , ఆ తర్వాతి పరిణామాల్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీహార్ క్యాడర్ కు చెందిన ఆయన .. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు రాలేదు. దాంతో అరెస్టు చేశారు.
సునీల్ కుమార్ నాయక్ 2005 బ్యాచ్‌కు చెందిన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఈయన, అప్పటి సీఐడీ విభాగంలో అత్యంత కీలక అధికారిగా కొనసాగారు. రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేసి గంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించిన సమయంలో సునీల్ నాయక్ అక్కడే ఉన్నట్లు విచారణలో తేలింది. రఘురామపై జరిగిన థర్డ్ డిగ్రీ హింస, శారీరక దాడి వంటి ఘటనల్లో అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌తో పాటు సునీల్ నాయక్ కూడా ప్రధాన పాత్ర పోషించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసు తీవ్రతను గమనించిన సునీల్ నాయక్, ఏపీలో తన డిప్యూటేషన్ ముగియడంతో తిరిగి తన సొంత క్యాడర్ అయిన బీహార్‌కు వెళ్ళిపోయారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ప్రకాశం , గుంటూరు పోలీసులు గతంలోనే వాట్సాప్ , ఫ్యాక్స్ ద్వారా నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టులో ఆయన వేసిన పిటిషన్ ను తిరస్కరించారు.
సునీల్ నాయక్ అరెస్టుతో ఈ కస్టోడియల్ టార్చర్ కేసు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇప్పుడు మరో కీలక ఐపీఎస్ అధికారి పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , ఇతర ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బీహార్‌లో అదుపులోకి తీసుకున్న సునీల్ నాయక్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
