తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి శ్రీవారి హుండీ డబ్బు లెక్కించే విభాగం లో రూ.100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడిన ఈ కుంభకోణం, గత వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారులు, పోలీసులు కలిసి చేసిన కుట్రగా చెబుతున్నారు. గతంలోనూ ఈ ఆరోపణలు చేసిన భానుప్రకాష్ రెడ్డి..మరోసారి అలాంటి ఆరోపణలు చేశారు. హైకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అంతా బయటపడాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ హయాంలో 2023 ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం సిబ్బంది, పెద్ద జీయర్ మఠంలోని క్లర్క్ సి.వి. రవి కుమార్‌ను దొంగతనం చేస్తూండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పరకామణి హాల్లో శ్రీవారి హుండీ లెక్కించే పనిలో ఉన్న రవి కుమార్, విదేశీ కరెన్సీ ను తన ఇన్నర్ వైర్లో దాచుకుని బయటకు వెళ్తుండగా పట్టుకున్నారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చార్జిషీటు దాఖుల చేసిన తరవా రవి కుమార్ చెన్నై, తిరుపతిలోని 7 ప్రధాన ఆస్తులను టీటీడీకి రాసిచ్చాడు. అప్పుడే కేసును లోక్ అదాలత్‌లో టీటీడీ అధికారులు క్లోజ్ చేశారు.
రవి కుమార్ వంటి సామాన్య క్లర్క్ ఎలా ఇన్ని ఆస్తులు కూడబెట్టాడని.. తరచూ విదేశీ కరెన్సీ, బంగారం వంటి వస్తువులు దొంగిలించి, సీనియర్ టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు అధికారులకు ఆస్తులు బహూకరించాడని ఆరోపించారు. రవి కుమార్ దొంగతనాలు 2019-2024 మధ్య జరిగాయని, ఇందులో తులాభారం వస్తువులు కూడా ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. దొంగతనాల్లో పాలుపంచుకున్న అందరి పేర్లు త్వరలో బయటపెడతానని టీటీడీ పవిత్రతకు ఈ విచారణ అవసరమని, విచారణ చేయించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి మీదనే ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవికుమార్ ఆస్తులను భూమన రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి సన్నిహితులకు చెబుతున్నారు.


