ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సుమారు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ సుదీర్ఘ సెషన్ ద్వారా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపనుంది. వీటితో పాటు వైసీపీ సభ్యులపై అనర్హతా వేటుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం
మొత్తం ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరై, రిజిస్టర్లో సంతకాలు చేసి ప్రయోజనాలు పొందినట్లు ఇప్పటికే అధికార పార్టీ గుర్తించింది. వారి విషయాన్ని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ యోచిస్తుండటంతో, ఆ ఆరుగురిలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే, త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో నెగ్గడం కష్టమని వారు భావిస్తున్నారు. అందుకే, పార్టీ అధినేత జగన్ను ఒప్పించి అయినా అసెంబ్లీకి హాజరై, తమ పదవులను కాపాడుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో కనీసం నలుగురు ఎమ్మెల్యేలు జగన్ అంగీకారం లేకపోయినా సభకు వెళ్లాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
సభకు వెళ్తే వైసీపీకి దూరం.. ఇతర పార్టీలు రానివ్వవు!
జగన్ ఆదేశాలను ధిక్కరించి సభకు వెళ్లాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవేళ వారు పార్టీ లైన్ దాటి అసెంబ్లీలో అడుగుపెడితే, అది వైసీపీతో బంధం తెంచుకున్నట్లేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించే మూడ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఆ నలుగురు ఎమ్మెల్యేలు అటు వైసీపీలో ఉండలేక, ఇటు కూటమిలో చేరలేక రాజకీయంగా త్రిశంకు స్వర్గం’లో పడే ప్రమాదం ఉంది. పదవులను వదులుకుంటే ఉప ఎన్నికల గండం పొంచి ఉండటం, పదవుల్లో ఉంటే పార్టీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరికి ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేకపోయినా, కనీసం తమ ఎమ్మెల్యే పదవులనైనా కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వారు సభకు హాజరయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే లోకల్ పోల్స్
అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు , పంచాయతీల పదవీకాలం మార్చి, ఏప్రిల్ నెలలతో ముగియనుండటంతో, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, వెంటనే ఎన్నికల నగారా మోగించేలా అధికార కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవైపు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యం, అనర్హత వేటు భయాల చుట్టూ రాజకీయం తిరుగుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాల్సిన బాధ్యత నేతలపై పడింది. అటు సభలో జరిగే పరిణామాలు, ఇటు స్థానిక ఎన్నికల హడావిడి వెరసి.. రాష్ట్రంలో గల్లీ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయ వాతావరణం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల ప్రజల్లో వచ్చే వ్యతిరేకతే కాదు.. అనేక రాజకీయ పరమైన విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
