ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై వైసీపీ సోషల్ మీడియా విన్యాసాలు చూస్తుంటే, మునిగిపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆసరానే అన్న సామెత గుర్తుకొస్తోంది. తన సోదరుడు, రెడ్డీ గ్లోబల్ పేరుతో ఆఫ్రికాలో నకిలీ లిక్కర్, మైనింగ్ వ్యాపారం చేసే అనిల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక కోసం చెన్నై వెళ్లారు. అక్కడ పెళ్లికి వచ్చిన అతిథులు జగన్‌ను పలకరించడాన్ని చూసి, ఏదో విశ్వవిజేతను ప్రపంచ దేశాల నేతలు వచ్చి కలిసినట్లు ఎలివేషన్లు ఇస్తుండటం పెద్ద హాస్యాస్పదంగా మారింది.
వైఎస్ అనిల్ రెడ్డి తమిళనాడులో రాజకీయ పరిచయాలున్న వ్యాపారవేత్త
అసలు కథ ఏమిటంటే.. వివాహ వేడుక నిర్వహించిన అనిల్ రెడ్డి పారిశ్రామికవేత్త, చెన్నైలో బాగా స్థిరపడిన వ్యక్తి. అనిల్ రెడ్డికి, జగన్‌కు మధ్య ఉన్న బంధం కేవలం బంధుత్వమే కాదు, ఆర్థిక మూలాల వెనుక ఉన్న బలమైన లింకులని రాజకీయ వర్గాల్లో గట్టి ప్రచారం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భారీగా నోట్ల కట్టలతో చెన్నై వెళ్తూ దొరికిపోయిన ఉదంతాన్ని ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకుంటున్నారు. దొరికినవి కొన్ని కట్టలైతే, దొరక్కుండా చేరినవి ఎన్ని కొండలో ఎవరికీ తెలియదు. అప్పట్లో జగన్ అధికారాన్ని వాడుకుని ఈ వ్యాపార సామ్రాజ్యం ఎంతలా లబ్ధి పొందిందో అందరికీ తెలిసిందే. ఆయనకు ఉన్న పరిచయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు విజయ్, సూర్య వంటి ప్రముఖులు ఆ వేడుకకు వచ్చారు. వచ్చిన వారు ఎదురుపడిన జగన్‌కు మర్యాదపూర్వకంగా హాయ్, బై చెబితే, దానికే ఓ రేంజ్లో బిల్డప్ ఇవ్వడం వైసీపీ కార్యకర్తల దివాలాకోరు తనానికి అద్దం పడుతోంది.
నమస్కారం పెట్టి..బాగున్నారా అని అడిగినా ఎలివేషన్లే
ఇప్పుడు అధికారం పోయి అడ్రస్ లేకుండా పోయిన తరుణంలో, ఇలాంటి పెళ్లి వేడుకల్లో ఎదురుపడే పలకరింపులనే మహాభాగ్యంగా భావించి ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి జగన్‌కు వచ్చింది. రాజకీయాల్లో ఎవరైనా ముఖ్య నేతను ప్రత్యేకంగా కలిస్తే దానికి ఒక విలువ ఉంటుంది. కానీ, ఒక శుభకార్యానికి వచ్చిన వారు ఎదురుపడితే కనీస మర్యాదగా పలకరించడం సంప్రదాయం. ఆ పలకరింపులకు రంగులు అద్ది, అగ్రనేతలంతా జగన్ కోసం క్యూ కట్టినట్లు ప్రచారం చేసుకోవడం చూస్తుంటే వైసీపీ గ్రాఫ్ ఎంత పాతాళానికి పడిపోయిందో అర్థమవుతోంది. ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడే రాజకీయం అని విర్రవీగిన నేత, ఇప్పుడు ఎవరో నమస్కారం పెడితేనే దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సి రావడం ఆయన రాజకీయ పతనానికి పరాకాష్ట.
పరువు తీసే ఎలివేషన్లు
పరువు పోయి, పార్టీ క్యాడర్ చెల్లాచెదురై, ఇలాంటి పెళ్లి పలకరింపుల తో పరువు కాపాడుకోవాలనుకోవడం కేవలం ఆత్మవంచనే. ఎలివేషన్లు ఇచ్చే బ్యాచ్ కూడా ఎంత దిగజారిపోయిందంటే, రేపు ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ చెయ్యి ఊపినా సరే, అది జగన్ క్రేజ్‌కు నిదర్శనం అని పోస్టర్లు వేసేలా ఉన్నారు. మొత్తానికి చెన్నై పెళ్లి వేడుకలో జగన్ సీన్ చూస్తుంటే, పడిపోయిన పరువును అతికించడానికి పడుతున్న పాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


