11వ తేదీన అస‌లైన మజా!

కొన్ని తేదీల్ని టాలీవుడ్ అస్స‌లు వ‌ద‌ల‌దు. పోటీ ఎక్కువైనా స‌రే – త‌మ సినిమాల్ని రంగంలోకి దింపాల‌ని నిర్మాత‌లు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ దృష్టి ఆగ‌స్టు 11పై ప‌డింది. వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వ‌లు వ‌స్తుండ‌డంతో… ఆగ‌స్టు 11ని టార్గెట్ చేశారు నిర్మాత‌లు. ఆ రోజున ఒకేసారి మూడు సినిమాలు రాబోతున్నాయి. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు – నేనే మంత్రి సినిమాల రిలీజ్ డేట్ ఆ రోజే ఫిక్స్ చేశారు. ఈ మూడు సినిమాల‌పైనా భారీ అంచ‌నాలున్నాయి.

బోయ‌పాటి శ్రీ‌ను సినిమా కావ‌డంతో.. మాస్‌ని జ‌య జాన‌కి నాయ‌క ఆక‌ర్షిస్తోంది. బాహుబ‌లి త‌ర‌వాత రానా నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, ప్ర‌చార చిత్రాలు బాగుండ‌డంతో నేనే రాజు – నేనే మంత్రిపై ఫోక‌స్ పెరిగింది. ఇక నితిన్ కూడా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. స‌రికొత్త గెట‌ప్ లో క‌నిపిస్తున్న ‘లై’…లో హిట్టు `బొమ్మ‌` ముందే క‌నిపించిపోతోంది. ట్రైల‌ర్ కూడా స‌రికొత్త‌గా క‌ట్ చేయ‌డం, అర్జున్ ఈ సినిమాకి ప్ర‌తినాయ‌కుడు కావ‌డంతో.. ‘లై’పై అంచ‌నాలు పెరిగాయి. ఈ మూడు సినిమాలూ ఇప్పుడు 11నే రాబోతున్నాయి. సాధార‌ణంగా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఒక‌ట్రెండు సినిమాల‌కే చోటుంది. కాక‌పోతే.. సెల‌వ‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి, ఈ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతో మూడు సినిమాలూ స‌మ‌ర‌శంఖం పూరించాయి. వీటిలో గెలుపు ఎవ‌రిదైనా…. సినీ అభిమానుల‌కు మాత్రం అస‌లైన మ‌జా అంద‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com