విశాఖలో ఓ శాటిలైట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ పూర్తి స్థాయి క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఎండాడ వద్ద ఇరవై ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. గత రెండు నెలల నుంచి ఆ సంస్థ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. చివరికి చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఐటీ పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వనున్నారు.
ఇన్ఫోసిస్ నుంచి ఈ నెలలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇండియా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఈ సంస్థ శాశ్వత క్యాంపస్ విశాఖకు వస్తే .. ఐటీ దిగ్గజం కంపెనీలన్నీ విశాఖలో భారీ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు అవుతుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ సహా పలు కంపెనీలు ఇప్పటికే పనులు ప్రారంంభించాయి. ఇన్ఫోసిస్ కూడా ఒప్పందం అయిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
గత ఏడాదిన్నరగా విశాఖ ఐటీ రంగానికి స్వర్ణయుగం నడుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ దిగ్గజాలు రావడమే ఆసక్తికరం. ఇవన్నీ వస్తే ఓ ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. దాని వల్ల భవిష్యత్ లో అనేక స్టార్టప్‌లు విశాఖ కేంద్రంగా ప్రారంభమవుతాయి.


