సినిమా విజయానికి సెకండ్ హాఫ్ చాలా కీలకం. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉన్నా సెకండ్ హాఫ్ బలంగా ఉంటే సక్సెస్ తో గట్టెక్కేయొచ్చు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి కూడా బలమైన సెకండ్ హాఫ్ కావాలి. ఈ ఏడాది తొలి భాగం టాలీవుడ్ తీపి కంటే కారాన్నే ఎక్కువగా చూసింది. సంక్రాంతి ఓ వెలుగు తప్పితే.. మిగతా సీజన్ డీలా పడింది. అక్కడక్కడా కోర్ట్, మ్యాడ్ 2, హిట్ 3, సింగిల్ లాంటి చిన్న సర్ప్రైజ్ ఉన్నాయి. ఇక కుబేర, కన్నప్పతో ఓ మోస్తరు ఇంటర్వెల్ బ్యాంగ్ దొరికింది. ఇప్పుడు భారమంతా సెకండ్ హాఫ్పైనే ఉంది.
ద్వితీయార్థంలో తొలి పెద్ద సినిమాగా పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ రెడీ అయ్యింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళ్యాణ్ కి తొలి పాన్ ఇండియా, పీరియాడిక్ సినిమా ఇది. నిజానికి సినిమా ఎప్పుడో రావాల్సింది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అనుమానాలు తొలగించింది. మంచి బజ్ క్రియేట్ చేసింది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు హంగామా చూసి చాలా కాలమైంది. పవన్ సినిమా హిట్ అయితే క్రౌడ్ మామూలుగా ఉండదు. ఈ సినిమాతో ఆ సందడి రావాలనే అందరూ కోరుకుంటున్నారు.
ఆగస్టులో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’, రజనీకాంత్ ‘కూలీ’. వార్ 2కి తెలుగు ఈ స్థాయి బజ్ రావడానికి కారణం.. ఎన్టీఆర్. తారక్ హిందీ పరిశ్రమలో చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇది. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా అలరించిన ఎన్టీఆర్ వార్ 2కి ప్రత్యేక ఆకర్షణ. నిజానికి ‘వార్’ సిరీస్‌కి ఇంత రేంజ్లో అంచనాలని పెంచిన ఫ్యాక్టర్ కూడా ఎన్టీఅరే. తారక్ కారణంగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో భారీస్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్ వదిలారు. ఎన్టీఆర్ సరికొత్త పాత్రలో కనిపించడం తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. ఇక రజనీకాంత్ కూలీని స్టార్ అట్రాక్షన్‌తో నింపేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే.. ఇలా చాలా పెద్ద తారాగణం ఉంది. రజనీ-లోకేష్ కాంబినేషన్ కావడంతో తెలుగులో సినిమా భారీ ధరకు పలికింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ ని బద్దలు కొడతాయనే అంచనాలు ఉన్నాయి. రవితేజ మాస్ జాతర కూడా ఆగస్ట్‌లోనే రాబోతోంది. ధమాకా తర్వాత రవితేజ సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఈ సినిమా ఆయన కెరీర్‌కి చాలా కీలకం.
ఈసారి సెప్టెంబర్‌తోనే దసరా వైబ్ మొదలైపోతుంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. బాలయ్య-బోయపాటి సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా అదరగొట్టింది. ‘అఖండ 2’ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25 వస్తోంది. ఇదే డేట్‌కి మరో క్రేజీ ప్రాజెక్ట్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇది. చిన్న గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కి చేరుకున్నాయి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయం. ‘హను-మాన్’ తో అలరించిన తేజ సజ్జా మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’తో వస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్‌తో బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్.
డిసెంబర్లో రాజాసాబ్గా వస్తున్నారు ప్రభాస్. నిజానికి ఆయన ప్రస్తుతం చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ లీగ్ సినిమా కాదు ఇది. ఇదొక హారర్ కామెడీ. మారుతి దర్శకుడు. ప్రభాస్ హారర్ కామెడీ చేయడం విశేషం. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గానీ, ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ కానీ సినిమాల్లో ముందు వరుసలో ఉంది విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’. విజయ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా ఇది. ‘జెర్సీ’ తర్వాత గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు విజయ్. చిరంజీవి ‘విశ్వంభర’ కూడా ఈ ఏడాదిలోనే రాబోతోంది. సీజీ వర్క్‌కి ఎక్కువ సమయం పట్టడంతో ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు. ఫాంటసీ జానర్లో వస్తున్న ఈ సినిమాపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా నిఖిల్ ‘స్వయంభూ’, అడివి శేష్ ‘డకాయిట్’, సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఇదే ఏడాది రాబోతున్నాయి.
మొత్తానికి టాలీవుడ్ కం బ్యాక్ ఇవ్వడానికి కావలసినంత కంటెంట్ సెకండ్ హాఫ్‌లో ఉంది. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.