2025 అనేది చరిత్ర. ఇప్పుడు దృష్టంతా కొత్త ఏడాదిపైనే. లెక్కలు తీస్తే – గతేడాది టాలీవుడ్ కి గట్టిగా ఎదురు దెబ్బలు తగిలాయి. 10 శాతం విజయాల్ని కూడా అందుకోలేకపోయింది. దానికి రకరకాల కారణాలు. అయితే 2026 మాత్రం అలా కాకూడదన్నది అందరి ఆశ. 2026లో కొన్ని క్రేజీ కాంబోలు సెట్టయ్యాయి. తప్పకుండా అభిమానుల్ని అవి అలరించేవే. 2026లో ఊరిస్తున్న కొన్ని క్రేజీ కాంబోలు ఏమిటన్నవి ఒక్కసారి పరిశీలిస్తే…
సంక్రాంతి సినిమాల్ని పక్కన పెడితే – 2026లో కొన్ని అసక్తికరమైన కాంబినేషన్లను చూడడానికి టాలీవుడ్ సిద్ధమైంది. అందులో మొదటి పేరు రామ్ చరణ్ – బుచ్చిబాబు. వీరిద్దరూ ‘పెద్ది’ సినిమాతో అలరించబోతున్నారు. మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా. కాకపోతే.. ఆయన వెనుక సుకుమార్ అనే ధైర్యం ఉంది. చరణ్‌ని బుచ్చి ఎలా చూపిస్తాడా? అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో వుంది. ‘చికిరి’ పాట ఇప్పటికే సన్సేషనల్ అయిపోయింది. మిగిలిన పాటలుపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోయిందని, చరణ్ నటన గురించి మాట్లాడుకొంటారని ఇన్ సైడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
‘పుష్ప’ తరవాత తన స్థాయి పెంచుకొన్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు తాను కూడా పాన్ ఇండియా స్టారే. అట్లీతో బన్నీ ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చక చక పూర్తవుతోంది. అట్లీకి కమర్షియల్ మీటర్ బాగా తెలుసు. బన్నీ కూడా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్. అయితే ఈసారి.. ఓ వినూత్నమైన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడానికి అట్లీ ప్రయత్నిస్తున్నాడు. విజువల్ గా కూడా ఈ సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉండబోతోందని టాక్. మరి అదెలాఉండబోతోంది? బన్నీలో అట్లీ చూపించబోతున్న కొత్త యాంగిల్ ఏమిటి? అనే విషయాలపై బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఓ ప్రభంజనం సృష్టించడం ఖాయం.
త్రివిక్రమ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ కింగ్ అనిపించుకొన్నాడు విక్టరీ వెంకటేష్. వీరిద్దరి కాంబినేషన్ ని తెరపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఆశలు ‘ఆదర్శ కుటుంబం’తో తీరబోతున్నాయి. కాంబో పరంగా క్రేజ్ ఉన్నసినిమా ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు.. కాస్త క్రైమ్ ని కూడా యాడ్ చేశాడు త్రివిక్రమ్. మరి ఈ మిక్సింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ప్రభాస్ ఇప్పుడు ఎవరితో సినిమా చేసినా, అది టాక్ ఆఫ్ ది టౌనే. ముఖ్యంగా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సందీప్ రెడ్డి టేకింగ్, మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోని చూపించే విధానంలోనే ఓ హీట్ ఉంటుంది. మరి ప్రభాస్ లాంటి కటౌన్ని సందీప్ ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. స్పిరిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా వాళ్లకు పండగే. ఈ సినిమా 2026లో రాకపోవొచ్చు. కానీ ఈ యేడాదంతా ఈ సినిమా గురించి రెబల్ ఫ్యాన్స్ మాట్లాడుకొంటనే ఉంటారు. ‘ఫౌజీ’ పై కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకొన్నారు. ఆ సినిమా కూడా ప్రత్యేకమే.
మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన కాంబినేషన్ చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల. నిజంగా ఈ కాంబోని ఊహించలేదు. శ్రీకాంత్ చేసింది ఒకే ఒక్క సినిమా. రెండో సినిమా సెట్స్‌పై ఉంది. అది పూర్తి కాకుండానే చిరుతో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు. పైగా ఈ చిత్రానికి నాని నిర్మాత. అందుకే కాంబో పరంగా విపరీతమైన అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా హీటెక్కించేదే. ఈ సినిమా చాలా కామ్ గా షూటింగ్ చేసుకొంటోంది. 2027లో ఈ సినిమా రావొచ్చు. మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ కూడా 2027లోనే వస్తుంది. కాకపోతే.. 2026 అంతా ఈ కాంబో గురించిన ముచ్చట్లు వినే అవకాశం ఉంది.
