శాసనసభలో కాంగ్రెస్ సభ్యులకు కేసీఆర్ సూటి ప్రశ్నలు

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని తెలంగాణా ప్రభుత్వం చారిత్రిక ఒప్పందంగా భావిస్తుంటే, దాని ద్వారా తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను తెరాస ప్రభుత్వం మహారాష్ట్రకి తాకట్టుపెట్టిందని కనుక అది ఒక ‘బ్లాక్ డే’ అని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండటంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులకు చాలా ఘాటుగా జవాబు చెప్పారు. అలాగే వారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేశారు.

పదేళ్ళ పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణాలో త్రాగునీరు,సాగునీటికి కరువు వచ్చేదే కాదు కదా? ఇప్పుడు మా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవలసిన అవసరమే ఉండేది కాదు కదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా ముఖ్యమంత్రులకు సలాములు కొడుతూ తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికయినా నిజాయితీగా తన తప్పిదాలను ఒప్పుకొని, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వంతో సహకరించాలని కేసీఆర్ కోరారు.

త్వరలోనే తమ ప్రభుత్వం లోయర్ పెన్ గంగ, లెండి ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్లు పిలువబోతోందని చెప్పారు. తెలంగాణాలో ప్రతీ నియోజక వర్గంలో లక్ష ఎకరాల చొప్పున రాష్ట్రం మొత్తం కోటి ఎకరాలకు నీళ్ళు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని తమ ప్రభుత్వం పని చేస్తోందని కేసీఆర్ చెప్పారు. అలాగే 2018 లోగా మిషన్ భగీరధ ప్రాజెక్టుని పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని త్రాగు నీరు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది డిశంబర్ లోగా రాష్ర్టంలో 6812 గ్రామాలకు, 12 పురపాలక సంఘాలకు నీళ్ళు అందించబోతున్నామని కేసీఆర్ చెప్పారు.

తమ ప్రభుత్వం తలపెట్టిన ప్రతీ అభివృద్ధి పనులను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయకుండా, రాష్ట్రాభివృద్ధి కోసం తమతో చేతులు కలిపి పనిచేయడానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలని కేసీఆర్ కోరారు. దేశం ముందు తెలంగాణా తలెత్తుకొనే విధంగా అభివృద్ధి సాధించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, తెలంగాణా పరువు తీసే విధంగా వ్యవహరించవద్దని కేసీఆర్ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. కేసీఆర్ వాగ్ధాటికి కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎదురు నిలువలేకపోవడం ఈరోజు శాసనసభలో విశేషంగా చెప్పుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com