భారతదేశంలోని మెట్రో నగరాల్లో సొంత ఇల్లు అనేది ఒక కల. అయితే, ఈ కల నెరవేర్చుకోవడానికి అయ్యే ఖర్చు నగరాన్ని బట్టి భారీగా మారుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక సామాన్య 2BHK అపార్ట్మెంట్ కొనాలంటే సగటున రూ.1.6 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇది దేశంలోనే అత్యధికం. ముంబై తర్వాత ఐటీ హబ్‌లుగా పేరుగాంచిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరులో సగటు ధర రూ.87 లక్షలు ఉండగా, హైదరాబాద్‌లో రూ. 77 లక్షలుగా నమోదైంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు నగరాల్లో మౌలిక సదుపాయాల పెరుగుదల, ఐటీ కంపెనీల విస్తరణ కారణంగా ధరలు గణనీయంగా పెరిగాయి.
నగరాల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని గమనిస్తే, ముంబై ధరతో పోలిస్తే మిగిలిన నగరాల్లో ఇళ్లు చాలా తక్కువకు వస్తున్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 2BHK ధర రూ.60 లక్షలుగా ఉండగా, దక్షిణ భారత నగరమైన చెన్నైలో రూ.51 లక్షలకే లభిస్తోంది. ఆశ్చర్యకరంగా, ఐటీ , తయారీ రంగాల్లో దూసుకుపోతున్న పుణెలో కూడా ధరలు స్థిరంగా రూ.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ముంబైలో ఇల్లు కొనడానికి పెట్టే ఖర్చుతో, అహ్మదాబాద్ లేదా కోల్‌కతా వంటి నగరాల్లో ఏకంగా 4 నుండి 5 ఇళ్లను కొనుగోలు చేయవచ్చని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అత్యంత సరసమైన ధరల విభాగంలో కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలు నిలిచాయి. కోల్‌కతాలో 2BHK సగటు ధర రూ.40 లక్షలుకాగా, అహ్మదాబాద్‌లో కేవలం రూ.32 లక్షలకే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. స్థలం కొరత, జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న చోట ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, విస్తరణకు అవకాశం ఉన్న నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. పెట్టుబడి కోణంలో చూస్తే హైదరాబాద్, బెంగళూరు నగరాలు వృద్ధిని కనబరుస్తుండగా, నివాసం కోసం అహ్మదాబాద్, పుణె వంటి నగరాలు బడ్జెట్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి.


