గ్రేటర్ హైదరాబాద్ ను భారీగా విస్తరించారు. 27 మున్సిపాలిటీలను విలీనం చేసి.. మూడు వందల వార్డులుగా ఖరారు చేస్తూ ప్రకటన చేసేశారు. ఈ ప్రకటన ప్రజలకు ఎలా ఉన్నా.. అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. కనీస చర్చ లేకుండా ఇలా ఎలా వార్డుల్ని విభజిస్తారని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అసంతృప్తికి గురవుతున్న వారిలో కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు.. ఫిరాయించిన దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కూడా ఉన్నారు. వారు కూడా..ఇలా మంచి పద్దతి కాదని అంటున్నారు. అందరూ విడివిడిగా అయినా వ్యతిరేకిస్తూ గ్రేటర్ కమిషనర్ ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు.
డీలిమిటేషన్‌కు ఓ విధానం
ఒక స్పష్టమైన విధానం లేకుండా డీ లిమిటేషన్ పేరుతో GHMC లో డివిజన్ లను ఇష్టమొచ్చినట్లు గా ఏర్పాటు చేశారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. డివిజన్ ల ఏర్పాటు లో జరిగిన తప్పిదాల వల్ల స్థానిక నాయకత్వంపై ప్రబావం పడుతుందని వారు అనుకుంటున్నారు. డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళం గా ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. హడావుడిగా ORR లోపల ఉన్న మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ లను GHMC లో విలీనం చేసి 150 ఉన్న డివిజన్ లను 300 కు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ అడుగుతున్న ప్రశ్న. డీలిమిటేషన్ చేయాలంటే ఓ పద్దతి ఉంటుందని ఎలా పడితే అలా చేస్తే..కోర్టుల్లో నిలబడదని.. రాజ్యాంగబద్ధం కాదని అంటున్నారు.
ప్రజాభిప్రాయం అయినా తీసుకోరా ?
రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసులలో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్ లను ఏర్పాటు చేశారు. డివిజన్ ల సరిహద్దులలో కూడా పారదర్శకత లేదు. ఇప్పుడున్న 150.డివిజన్లకు సరియైన అధికారులు, ఉద్యోగులు లేరు. నూతనంగా మరో 150 డివిజన్ లను ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం కష్టమవుతుంది. కనీసం ఇలా విలీనం చేస్తున్నప్పుడు ప్రజాభిప్రాయం అయినా తసుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. ఇలా ఏకపక్షంగా చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చివరికి ఆ ప్రక్రియ వివాదాల్లో ఇరుక్కుపోతుందని అంటున్నారు.
కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేలకూ అసంతృప్తే
వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని దానం నాగేందర్, అరికెపూడి గాంధీ అంటున్నారు. డీ లిమిటేషన్‌పై అభ్యంతరం తెలపడానికి కమిషనర్‌ను కలిశారు. కనీసం తమకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీ లిమిటేషన్ చేశారని .. డీ లిమిటేషన్‌పై కార్పొరేటర్లలో ఆవేదన ఉందని చెబుతున్నారు. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు ఉన్నాయని … హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని అంటున్నారు. అభిప్రాయాలను తెలుసుకునేందుకు గ్రేటర్ కమిషనర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కానీ.. ఈ విషయంలో మాత్రం.. ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సంతృప్తిగా లేరు. మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా
