ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కీలకమైన శక్తిగా మారుతుందనీ, తమ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పడే పరిస్థితి ఇక్కడి ప్రముఖ పార్టీలకి ఉంటుందని జోస్యం చెప్పారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రాలో హంగ్ వస్తే, రాష్ట్రంతోపాటు దేశప్రయోజనాలకు అనుకూలంగా ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దివంత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడనీ, ఆయన చనిపోవడానికి కొన్ని రోజులు ముందు జరిగిన సమావేశంలో… రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకూ విశ్రమించొద్దని తమతో చెప్పారనీ, ఇప్పుడు ప్రజల్లోకి అదే వైయస్ మాటను తీసుకెళ్లబోతున్నామని రఘువీరా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు బయటకి వెళ్లిపోవడం అనేది కొత్త అంశం కాదనీ, 1978లో 83లో గత ఎన్నికల సమయంలో కూడా నాయకులు చాలామంది వెళ్లిపోయారన్నారు. అయితే, ఇప్పుడు కష్టపడే వారిని పార్టీలోకి తీసుకొస్తామనీ, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ… తెలంగాణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ఆయన్ని టి. కాంగ్రెస్ పిలిచిందో లేదో తనకు తెలీదన్నారు. ఆంధ్రాలో మాత్రం ఎన్నికల ప్రచారానికి చిరంజీవి వస్తారన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, ఎన్నికల నాటికి ఆయన కచ్చితంగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు రఘువీరా.
ఇక, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి భాజపా ఎంత దూరమో, వైకాపా ఎంత దూరమో, టీడీపీ కూడా అంతే సమాన దూరంలో ఉందన్నారు రఘువీరా! తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదు అనేది మొదట్నుంచీ తమకు స్పష్టత ఉందనీ, అదే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తమకు చెప్పారన్నారు. ఏపీలో ప్రచారం మొదలుపెట్టిన తరువాత… రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు రఘువీరా. చిరంజీవి ప్రచారానికి వస్తారని రఘువీరా అంటున్నా… ఆచరణలో అది సాధ్యమయ్యేట్టుగా కనిపించడం లేదు. అలాగే, టీడీపీని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎలా విమర్శిస్తుందో చూడాలి. ఎందుకంటే, జాతీయ స్థాయి రాజకీయాలకు వచ్చేసరికి ఇదే టీడీపీ మద్దతు అక్కడ కాంగ్రెస్ కి కావాల్సిన పరిస్థితి ఉంది కదా!