టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని రప్పించాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కావడంతో పాటు.. ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు పూర్తి కావొస్తుండడం తో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుండే మొదలు పెట్టాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరి సమక్షంలో చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఆ తరహాలోనే ఇప్పుడు టీడీపీ కోసం వారంతా తరలి వస్తారని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు. అప్పడు ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. మహానాడులో చేపట్టబోయే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీ కార్యక్రమం కాదని.. అది మహనీయుడ్ని గౌరవించుకునే కార్యక్రమం అని..మహానాడు వేదిక మీదనే జరపడం మంచిదని అభిప్రాయానికి ఎన్టీఆర్ కుటుంబం వస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రతీ ఏడూ తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా మే నెల 27,28తేదీలలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తుంది టీడీపీ . కరోనా కారణంగా జూమ్లోనే గత రెండేళ్లుగా జరిగాయి. ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించబోతున్నారు. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న నందమూరి కుటుంబ సభ్యులను కూడా మహానాడులో పాల్గొంటే.. ముఖ్యంగా నందమూరి హరి కృష్ణ కుమారులైన కల్యాణ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ లను మహానాడులో కనిపిస్తే పార్టీలో ఎప్పుడూ లేనంత జోష్ వస్తుందని టీడీపీ క్యాడర్ భావిస్తున్నారు.