సమయం లేదు.. సందర్భం లేదు..అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బండి సంజయ్ ఓ రేంజ్ లో పొగిడేశారు. కోమటిరెడ్డి మంచి మనిషి.. భోళా మనిషి అని కితాబులిచ్చారు. కలిసి పని చేయాలని కూడా అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించడానికి నితిన్ గడ్కరీ తెలంగాణకు వచ్చారు. ఆదిలాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు . అక్కడ మాట్లాడిన బండి సంజయ్.. అనూహ్యంగా కోమటిరెడ్డి ప్రస్తావన తెచ్చారు. ఆయనను పొగిడారు.
కోమటిరెడ్డిని పొగడటానికి ఒక్కటే లింక్ ఉంది.. అదేమిటంటే.. కోమటిరెడ్డి ఇప్పుడు తరచుగా గడ్కరీని కలుస్తున్నారు. ప్రాజెక్టుల కోసం కలుస్తున్నానని చెబుతూంటారు. అందుకే ఆయనను పొగిడేశారు. కోమటిరెడ్డి కలిసేది.. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కోసం..ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల కోసం కాదు. అయినా పొగడాలనిపించి పొగిడేశారు. బండి సంజయ్ పొగడ్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాస్త కొత్తే. కానీ ఆయన అంతర్గత రాజకీయం ఆయనది.
బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు ఎవర్నీ పొగడరు. ఎవరి మీద అయినా అభిమానం ఉంటే దాచుకుంటారు. బహిరంగంగా పొగడరు. అది తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి విషయంలో ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. బండి సంజయ్ ఊరకనే అన్నారా లేకపోతే దీని వెనుక ఏదైనా రాజకీయం ఉందా .. అన్నది బీజేపీ నేతలకూ అర్థం కావడం లేదు.