ప్రకాష్ రాజ్‌కు పవన్ కల్యాణ్ తప్ప ఈ దేశంలో మరే సమస్యా కనిపిస్తున్నట్లుగా లేదు. ఆయన భావదారిద్ర్యాన్ని వాడుకునేందుకు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిపోయింది. పవన్ కల్యాణ్ పై , ఆయన భావాలపై విమర్శలు చేయడం అంటే ముందుకు పడిపోయే ఆయన తీరును వాడుకునేందుకు ఆ పార్టీకి చెందిన పెయిడ్ యూట్యూబ్ చానళ్లు వరుసగా ఇంటర్యూలు చేసేస్తున్నాయి. పవన్ పై, పవన్ విధానాలపై విమర్శలు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నాయి. ఈ రాజకీయ కుట్ర గురించి ప్రకాష్ రాజ్ కు తెలియనంత అమాయకుడేం కాదు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కోసం పెద్దగా పని చేయడం లేదు.. కానీ పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ కోసం పని చేయడానికి రంగంలోకి దిగిపోయారని అనుకోవచ్చు.
పవన్ పై వ్యాఖ్యలు చేయించేందుకు యూట్యూబ్ ఇంటర్యూలు
పవన్ చెప్పిన సనాతన ధర్మంపై ప్రకాష్ రాజ్ కు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ పవన్ ఏం చెప్పారో దాన్ని వక్రీకరించకూడదు. సనాతన ధర్మం అనేది మానవత్వానికి సంబంధించినదని.. ఎవరి అథ్యాత్మక నమ్మకాలు వారివని.. ఇతరుల నమ్మకాల్ని కించపర్చకూడదని చెబుతున్నారు. అంతే కానీ సతీసహగమనం.. బాల్యవివాహాల గురించి చెప్పలేదు. కానీ ప్రకాష్ రాజ్ అవి సనాతన ధర్మంలో భాగమని కొత్త వాదన వినిపిస్తున్నారు. పవన్ చెప్పని విషయాలను చెప్పి ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. ఇంకా పవన్ రాజకీయాలపైనా విమర్శలు చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఏ భాషలో ఇంటర్యూ ఇచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా ముగియదు.
పవన్ డిప్యూటీ సీఎం – ఆయన రాజకీయ సక్సెస్ గుర్తించలేరా?
ఇతర రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు కానీ.. ఆయా రాష్ట్రాల్లోనూ పార్టీ పెడతానని ఎప్పుడూ చెప్పలేదు. అయినా ప్రకాష్ రాజ్ ఎటకారం చేశాడు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రభావం ఏమిటో.. తెలుగురాష్ట్రాలు చూస్తున్నాయి. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఓ అరాచక శక్తిని పాతాళంలోకి నెట్టేయడంలో ఆయన పాత్ర చాలా కీలకం. అంత పవర్ చూపించిన పవన్ ను ప్రకాష్ రాజ్ గుర్తించకపోతే అది అయన మానసిక వైఫల్యమే కానీ పవన్ కు నష్టం ఎలా అవుతుంది?
ఐదు వందల ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తి – ప్రచారం కోసం నిందలు !
ప్రకాష్ రాజ్.. స్వతంత్రంగా బెంగళూరులో పోటీ చేసి నాలుగు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆయనకు అలాంటిది. సినిమాల్లో, మీడియాల్లో తనకు నటన పరంగా వచ్చిన పేరుతో.. పవన్ వంటి వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రచారం వస్తుందేమో కానీ.. క్యారెక్టర్ పోతుంది. ఇప్పటికే కొంత కోల్పోయారు. రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారితే పూర్తిగా కోల్పోతారు.