టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పటివరకు 67టెస్టు మ్యాచులు ఆడిన రోహిత్.. 4,301పరుగులు చేశారు. అందులో 12 సెంచరీలు , 18 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ తాజాగా టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికారు.
రోహిత్ శర్మ..తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్ గా సేవలు అందించి, జట్టుకు అనేక విజయాలు అందించాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ రోహిత్.
రోహిత్ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ, గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిపించి చరిత్ర సృష్టించాడు. రోహిత్ సారధ్యంలో వన్డే ప్రపంచ కప్ కూడా అందేది. ఇండియా వేదికగా జరిగిన ఫైనల్ లో టీమిండియా ఓటమి పాలైంది. వన్డే, టీ20లో కెప్టెన్సీతోపాటు ఆటగాడిగా తనదైన ముద్రవేసిన రోహిత్.. టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయాడు.
ఈ ఐపీఎల్ మొదట్లో తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్..గత నాలుగు మ్యాచ్ లో సత్తా చాటాడు. మళ్లీ ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడని భావిస్తుండగానే.. అభిమానులకు షాక్ ఇస్తూ టెస్ట్ లకు గుడ్ బై చెప్పేశాడు.