తమిళనాడులో మారుతున్న రాజకీయంతో టీవీకే అధినేత విజయ్ బేలగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి ఆయన ఆత్మవిశ్వాసంతో రాజకీయాలు చేయలేకపోతున్నారు. పొత్తులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరిపోరుచేస్తున్నారు. ఓటు బ్యాంకు ఏర్పడుతుంది కానీ.. మూడో స్థానం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. రోజు రోజుకు పుంజుకుంటారని అనుకుంటే .. వ్యక్తిగత వివాదం మీదకొచ్చి పడింది. దీంతో విజయ్ మాత్రం ఆత్మరక్షణలో పడిపోతున్నారు. అది ఆయన ప్రసంగాల్లో కనిపిస్తోంది. తనను టార్గెట్ చేస్తున్నారని చెబుతూ.. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడగడం ప్రారంభించారు. ఇదిఆయనలో తగ్గిపోతున్న నమ్మకాన్నిచూపిస్తోంది.
విజయ్ దూకుడుకు బ్రేక్ వేసిన కరూర్ తొక్కిసలాట ఘటన
కరూర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విజయ్ రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మారింది. 41 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన సభలు , ఆయన ప్రసంగాల్లో మునుపటి వాడి తగ్గింది. ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాల్సిన చోట, కేవలం ఇండోర్ స్టేడియాలకే పరిమితం కావావాల్సి వస్తోంది. ఆ ఘటన తర్వాత విజయ్ ఆత్మవిశ్వాసంతో రాజకీయాలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నప్పటికీ, అనుకోని ప్రమాదాలు ఆయనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సంఘటన తర్వాత ఆయన ప్రసంగాలు, బహిరంగ సభల్లో పాల్గొనే విధానంలో కూడా మార్పు కనిపిస్తోంది.
పొత్తుల రాజకీయాల్లో వైఫల్యం
తమిళనాడు రాజకీయాలను చూస్తే కూటములే ఫలితాలను శాసిస్తాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొత్త పార్టీలకు పొత్తులు చాలా ముఖ్యం. కానీ, విజయ్ విషయంలో పొత్తులు కుదుర్చుకోవడం అంత సులభం కాదని తేలింది. విజయ్ తో పొత్తు పెట్టుకుంటే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఇతర పార్టీలు సిద్ధంగా లేవు. ఈ కారణంతో, విజయ్ చివరికి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటరి పోరాటం వల్ల ఆయనకు ప్రజల మద్దతు లభించినా, అది విజయానికి దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రాజకీయ సర్వేలు విజయ్ పార్టీకి పెద్దగా సానుకూలంగా లేవు. టీవీకేకు ఓటు బ్యాంకు ఏర్పడుతున్నప్పటికీ, అది మూడో స్థానం వరకే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి.
కుటుంబ వివాదంతో మరింత ఆత్మరక్షణ ధోరణి
విజయ్ రాజకీయ జీవితానికి పెద్ద అడ్డంకిగా ఆయన వ్యక్తిగత జీవితంలోని వివాదాలు మారాయి. విభేదాలను పరిష్కరించుకోకుండానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. భార్య విడాకులకు దరఖాస్తు చేస్తూ వివాహేతర బంధాన్ని వెల్లడించింది. తండ్రితో ఇప్పుడు రాజకీయాల కోసం సఖ్యతగా ఉంటున్నారు కానీ గతంలో తండ్రితోనూ వివాదాలున్నాయి. ఇవన్నీ చర్చకు వస్తాయి.
ఒక్క చాన్స్ ప్లీజ్ అని అడిగితే ఇమేజ్ డ్యామేజ్
తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. అధికార డీఎంకే పార్టీ ఇతర పార్టీలను బలహీనపరుస్తూ ముందుకు సాగుతోంది. అన్నాడీఎంకే బలాన్ని కూడా డీఎంకే తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో, విజయ్ డీఎంకే దూకుడుకు తట్టుకోలేక ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఆయన ప్రసంగాల్లో తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పడం, తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరడం వంటి అంశాలు ఆయనలో తగ్గుతున్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అప్పుడే సానుభూతి కోసం ప్రయత్నించడం.. ఆయన హీరోయిజాన్ని ఊహించుకునేవారికి రుచించదు.


