ఒక్కో హీరో ఒక్కో జోనర్లో స్పెషలిస్టు. ఆల్ రౌండర్లూ ఉంటారనుకోండి. కాకపోతే… అభిమానులు మాత్రం వాళ్లని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలంటే ఏదో ఓ జోనర్ లో రాటు దేలిపోవాలి. అలా.. శ్రీవిష్ణు కామెడీకి కేరాఫ్ అడ్రస్స్ అయ్యాడు. యంగ్ హీరోల్లో చాలామందికి ఓ అలవాటు ఉంది. రెండు హిట్లు పడగానే, మాస్ బాటలో నడవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే మాస్‌ని మెప్పిస్తే స్టార్ డమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ సినిమాల మైలేజీ వేరు. అలా యంగ్ హీరోలు తరచూ మాస్ కథల వైపు మొగ్గు చూపిస్తుంటారు. శ్రీవిష్ణు కూడా అడపా దడపా అలాంటి ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పుడు తను… కామెడీ కి షిఫ్ట్ అయిపోయినట్టు అనిపిస్తోంది. ఈమధ్య శ్రీవిష్ణు హిట్ సినిమాల జాబితా తిరగేస్తే రాజ రాజ చోర, సామజవరగమన, ఓం భీమ్ భుష్.. తాజాగా ‘సింగిల్’ సినిమాలు కనిపిస్తాయి. వీటన్నింటిలోనూ శ్రీవిష్ణు చేసినవి ఈజీ గోయింగ్ పాత్రలే. వాటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేశాడు. ‘సింగిల్’లో అయితే ఎక్కడా నటించినట్టు కనిపించలేదు. ఆ పాత్ర అలానే ప్రవర్తిస్తుందేమో అన్నంత ఈజ్ తో చేసేశాడు.
శ్రీవిష్ణు ఇక పూర్తిగా కామెడీ కథల్ని నమ్ముకొంటే మంచిది. ఎందుకంటే ఈ జోనర్లో సినిమాలు చేసే హీరోలు తగ్గిపోయారు. నిన్నా మొన్నటి వరకూ నాని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసేవాడు. తాను ఇప్పుడు దసరా, హిట్ 3 అంటూ యాక్షన్ బాట పట్టాడు. భవిష్యత్తులోనూ నాని ఇలాంటి సీరియస్ సినిమాలే చేసే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ సెగ్మెంట్ ని శ్రీవిష్ణు కాపాడుకొంటూ, సినిమాలు చేసుకొంటే వెళ్తే కచ్చితంగా మరిన్ని విజయాలు శ్రీవిష్ణు దక్కించుకోగలడు. కాకపోతే శ్రీవిష్ణు అప్పుడప్పుడూ ప్రయోగాలు అంటూ వెరైటీ కథలు ఎంచుకొంటుంటాడు. అలా చేసిన కొన్ని సినిమాలు శ్రీవిష్ణుకి నటుడిగా పేరు తీసుకొచ్చాయి. కానీ నిర్మాతకు పైసలు మిగల్లేదు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవిష్ణు జాగ్రత్తగా ముందడుగు వేస్తే మంచిది. పైగా టైటిల్ కార్డ్ లో ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ వేసుకొన్నాడు. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా విష్ణుదే.