రాజకీయాలు అంటే డ్రామాలు చేయడం అని వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ డ్రామాలు తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఏం చేసినా డ్రామాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి కోసం.. ఎప్పటికప్పుడు స్కిట్లు రెడీ చేసేందుకు సజ్జల నేతృత్వంలో ఓ టీమ్ పని చేస్తుంది. ఇప్పుడు ఆ ఫార్ములాని వైసీపీ నేతలు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో నవరసాల్ని మీడియా ముందు ఎలా పండించారో.. తమ కెమెరాల ముందు ఎలా నటించాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ వారి దురదృష్టం ఏమిటంటే.. వారు ఏం చేసినా అందులో కామెడీనే పండుతోంది.
జగన్ బయటకు వస్తే ఓన్లీ స్క్రిప్టెడ్ షో!
జగన్ రెడ్డి ఎప్పుడైనా బయట పర్యటనకు వెళ్లాలంటే.. బయలుదేరిన దగ్గర నుంచి మళ్లీ ఇంటికి చేరే వరకూ ఏమేమి జరగాలో ముందు రాసి పెట్టి ఉంటుంది. ఆ ప్రకారం జరిగిపోతుంది. ఆయనను చూసేందుకు వచ్చేది రెండు, మూడు వందల మంది అయినా వారు జగన్ రెడ్డి చుట్టూనే తోసుకుంటూ ఉండాలి. కెమెరా ఆ మాత్రమే చూపించాలి. ఇక శవయాత్ర అయినప్పుడు తన కోసం కుప్పలు కుప్పలుగా జనం వచ్చారని చూపించుకునేందుకు జన సమీకరణ కూడా చేయాలి. సెక్యూరిటీ సరిగ్గా లేదని చెప్పడానికి కొద్దిగా గందరగోళం కూడా సృష్టించాలి. అన్నీ జరిగిపోతాయి.. కానీ వాళ్ల టాలెంట్ ఎలా ఉంటుందంటే.. తెర మీద నాటకంలో నటిస్తున్నట్లుగానే ఉంటుంది. అంత కృతకంగా ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటారో మరి !
జగన్ ఫార్ములాను పాటిస్తున్న సకలకళావల్లభులు!
వైసీపీలో మనుగడ సాగించాలంటే.. డ్రామాలు బాగా వచ్చి ఉండాలి. అలాంటి డ్రామాలతో పరువు పోగొట్టుకోవాలి. విడదల రజనీ లాంటివాళ్లు ఈ విషయంలో జగన్ మెప్పు కోసం.. కొత్త కొత్త డ్రామాలు వేస్తున్నారు. మోసం కేసులో నిందితుడ్ని తన కారులో తీసుకు వచ్చి పోలీసులు వస్తే అడ్డుకోని హంగామా చేశారు. తర్వాత ఓ మహిళగా ఉండి చేయకూడని ఆరోపణలు చేశారు. వీడియోల్లో ఏం జరిగిందో అంతా చూశారు. అయినా ప్రెస్మీట్ పెట్టి.. ఒక్క కంటితో.. నాలుగు కంటి చుక్కలు కార్చేంత నటన కూడా చూపించారు. చిలకలూరిపేటలో ఆమె రీల్స్ లో చూపిన నటనా నైపుణ్యం అక్కడి ప్రజలందరికీ తెలుసు. అందుకే కొత్తగా వారు ఆశ్చర్యపోలేదు. కానీ నవ్వుకున్నారు.
ఫేక్ మీడియా, సోషల్ మీడియాతో నడిచిపోతుందా ?
తాము ఏం చేసినా… ప్రజల్ని నమ్మించగలమని వైసీపీ నేతలు ఎందుకు అనుకుంటున్నారో కానీ.. ప్రజలు అప్ డేట్ అవుతున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవడం లేదు. ప్రజలు ఏం జరిగినా తెలుసుకుంటున్నారు. డ్రామాలు ఆడితే నవ్వుకుంటున్నారు. ఇదేం పిచ్చితనమని గట్టిగానే అడుగుతున్నారు. అయినా వైసీపీ నేతలు మాత్రం.. తమ డ్రామాలకు మెచ్చి ఓట్లు వేస్తారనే అనుకుంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ డ్రామాలు పార్టీ నుంచి మరిన్ని కామెడీ స్కిట్లు ఆశించవచ్చు. అవి జబర్దస్త్ ను మించి పోవచ్చు కూడా. .!