నాలుగు రోజుల్లో రిలీజ్ అనగా… ‘హే భగవాన్’ సినిమాకు సెన్సార్ బ్రేకులు వేసింది. సినిమా టైటిల్ మార్చాలని, లేదంటే విడుదలకు అనుమతి ఇవ్వమని అల్టీమేట్టం జారీ చేసింది. దాంతో దర్శక నిర్మాతలకు ఏం పాలుపోవడం లేదు.
సుహాస్ హీరోగా నటించిన సినిమా ఇది. సెన్సార్ బోర్డుకు కథతో కానీ, పాత్రలతో కానీ, సన్నివేశాలతో గానీ అభ్యంతరం ఏం లేదు. కానీ పేరుతో మాత్రం పేచీ వచ్చింది. ఈ పేరు వల్ల.. ఓ వర్గం మనో భావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సెన్సార్ బోర్డు అభిప్రాయపడుతోంది. ‘ఓ మై గాడ్’, ‘ఓరి దేవుడా’… ఇలాంటి టైటిళ్లకు లేని అభ్యంతరం ఈ పేరులో ఏముందన్నది నిర్మాతల ప్రశ్న.
టీజర్, ట్రైలర్.. రెండూ సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లాయి. అప్పుడైనా టైటిల్ గురించిన అభ్యంతరాలు వ్యక్తపరచాల్సింది. కానీ.. అప్పుడు సెన్సార్ బోర్డు మౌనంగానే ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు మాత్రం అడ్డు కట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో హీరో పేరు భగవాన్. అందుకే ఆ టైటిల్ పెట్టారు. నిర్మాతలు రెండు మూడు ప్రత్యామ్నాయ పేర్లని సూచించారు. కానీ సెన్సార్ వాటికీ ఓకే చెప్పలేదు. ‘ఇక మా వల్ల కాదు.. ఆ టైటిల్ ఏదో మీరే పెట్టుకోండి’ అని నిర్మాత కూడా చేతులెత్తేసినట్టు సమాచారం.
ఈవారం విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకూ ఇలాంటి అభ్యంతరమే వచ్చింది. టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డు సలహా ఇచ్చింది. మార్చకపోతే..’ఏ’ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఆఖరి నిమిషంలో పేరు మార్చడం ఇష్టం లేక ‘ఏ’ సర్టిఫికెట్ తో సరిపెట్టుకొంది చిత్రబృందం. ఇక్కడ మాత్రం ‘పేరు మార్చాల్సిందే’ అని సెన్సార్ పట్టుపడుతోంది. సినిమాలో దేవుళ్లనీ, హిందుత్వాన్నీ కించ పరిచే సన్నివేశాలు ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో అభ్యంతరాలు ఏం లేవు. కానీ ఈ కథ అలాంటిది కాదు. కానీ… ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది.
