తమిళ రాజకీయాల్లో దళపతి గా చక్రం తిప్పుతారని ఆశించిన విజయ్‌కు, రాజ్యాంగ చదరంగంలో మొదటి రోజే చుక్కలు కనిపించాయి. అతిపెద్ద పార్టీగా అవతరించి, కోటపై జెండా పాతేయడమే ఆలస్యం అనుకున్న ఆయనకు.. రాజ్‌భవన్ మెట్లు ఎక్కడం, దిగడం లోనే సరిపోయింది. ఎన్నికల ఫలితాలు రాగానే ముఖ్యమంత్రి అయిపోవడం వేరు, ఆ కుర్చీ వరకు వెళ్లడం వేరని విజయ్‌కు గవర్నర్ ప్రాక్టికల్ క్లాసులు తీసుకుంటున్నారు.
ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తున్న టాక్ ఒక్కటే.. పార్టీ ఆయనదే, మెజార్టీ ఆయనదే.. కానీ ఆఖరికి ప్రమాణ స్వీకారం చేసే టైం కూడా ఆయనది కాదు అని.
విజయ్ ఇంటికి, రాజ్‌భవన్ కి మధ్య జరిగిన ఆ యూ-టర్న్ డ్రామా అయితే ఒక రేంజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందని బయలుదేరడం, మధ్యలోనే మళ్లీ ఇంటికి వెళ్లడం, మళ్లీ రాజ్ భవన్ కు పరుగులు పెట్టడం చూస్తుంటే.. అక్కడ స్క్రిప్ట్ విజయ్ రాసుకున్నది కాదని, ఎవరో వెనక నుంచి ఆడిస్తున్నారని స్పష్టమవుతోంది.
విజయ్ తన లక్కీ టైం అని భావించి మధ్యాహ్నం మూడు గంటలకు బాధ్యతలు చేపట్టాలని ప్లాన్ చేసుకుంటే.. గవర్నర్ మాత్రం అబ్బే! కుదరదు.. ఉదయం పది గంటలకే ముగించేయండి అని అల్టిమేటం జారీ చేశారు. ఫలితంగా తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, గవర్నర్ గీసిన గీత దాటకుండా ప్రమాణం చేయడానికి విజయ్ సిద్ధపడాల్సి వచ్చింది. తాను తమిళగ వెట్రి కళగం స్థాపించింది శాసించడానికి అని విజయ్ అనుకుంటే, తీరా చూస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
దళపతి తన పొలిటికల్ ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే ఇంతలా తడబడతారని ఆయన ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు. ఈ గందరగోళం చూస్తుంటే విజయ్ తన సొంత గేమ్‌లో తనే ఒక నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బలంతో దర్జాగా వెళ్లాల్సిన విజయ్, ఇలా ప్రతి అడుగుకూ రాజ్‌భవన్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడటం చూస్తుంటే.. మున్ముందు ఈ పొలిటికల్ జర్నీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇప్పుడే చాలా మంది ఓ అంచనాకు వస్తున్నారు.
