డీఎంకే, అన్నాడీఎంకేలకు కలిపి విజయ్ కు చెక్ పెట్టాలనుకున్నది సూపర్ స్టార్ రజనీకాంత్ అట. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన కొత్త పలుకులో ప్రకటించారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు రజనీకాంత్.. స్టాలిన్ వద్దకు వెళ్లి చర్చలు జరిపారట. కానీ స్టాలిన్ అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని చెప్పడమే కాదు.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం తన మిత్రపక్షాలు టీవీకే వైపు వెళ్లదల్చుకుంటే.. తనకు అభ్యంతరం లేదని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారట. డీఎంకే,అన్నాడీఎంకే కలుస్తాయని తమిళనాట విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈ అంశంలోకి రజనీకాంత్ ను తీసుకు రావడమే కాస్త విచిత్రం.
ఈ వారం తన కొత్త పలుకులన్నీ ఆర్కే.. మోదీ, అమిత్ షాలను పొగడటానికే కేటాయించారు. వారు అసలు పరిపాలన చేయరని.. ఇరవై నాలుగు గంటలూ.. ఈట్ పాలిటిక్స్.. డ్రింక్ పాలిటిక్స్.. స్లీప్ పాలిటిక్స్ అన్నట్లుగా ఉంటారని చెప్పుకొచ్చారు. మరి పరిపాలన ఎవరు చేస్తారంటే.. నమ్మకస్తులైన అధికారులకు అప్పగించేస్తారని ఆర్కే చెబుతున్నారు. చాలా దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాజకీయాల్లో వారు విజయాలు సాధిస్తున్నారని.. ఇతర రాజకీయ పార్టీలు కూడా మోదీని చూసి నేర్చుకోవాలని ఆయన సలహాలిచ్చారు. అయితే రాజకీయం నేర్చుకుంటే వచ్చేది కాదు. బీజేపీకి తగ్గట్లుగా మోదీ, షా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంత చాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. రాజకీయాల్లో గెలిచే వాడిదే సక్సెస్ ఫుల్ వ్యూహం. రేపు మోదీ ఓడిపోతే.. ఆయన ఎక్కడ తప్పులు చేశారో అని ఇవాళ ప్లస్ పాయింట్లుగా చెప్పినవే.. రేపు మైనస్ పాయింట్లుగా విశ్లేషిస్తారు.
రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ తిరుగులేని శక్తిగా ఉంది. ప్రాంతీయ పార్టీలు అయినా.. కాంగ్రెస్ అయినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్నాళ్లకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ బీజేపీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని అధిగమిస్తున్నాయి. వరుసగా బీజేపీ ప్రభుత్వాలు కంటిన్యూస్ పొందుతున్నాయి. అంటే అధికార పార్టీల కన్నా .. విపక్షాలపైనే ప్రజలు వ్యతిరేకత పెంచుకుంటున్నారని ఆర్కే విశ్లేషణ.
గుజరాత్లో ఒకప్పుడు ఏం జరిగిందో అదే ఇప్పుడు దేశమంతా అమలు చేస్తున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. గుజరాత్ లో జరిగిన అంశం వల్ల బీజేపీ రాజకీయంగా దెబ్బతిన్నదని గతంలో ఆంధ్రజ్యోతి చాలా సార్లు చెప్పింది. ఆ అంశాలపై ఉద్యమాలే చేసింది. మొదటి విడత పాలన సమయంలో మోదీ తీవ్ర ప్రజావ్యతిరేకతకు గురవుతున్నారని చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. అందుకే ఆర్కే.. అదే బీజేపీకి ప్లస్ అయిందని అంటున్నారు. ఎక్కడ మత కలహాల్లేవని కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే మోదీ రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్కేకు కూడా చాలా కాలం పట్టిందన్నమాట.



