కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్‌తో కలిసి దూరం చేసి బండి సంజయ్‌కు గట్టి షాకివ్వాలనుకున్న కేటీఆర్ చివరి క్షణంలో ఆ నిర్ణయం తమకు లెక్కలేనన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని గ్రహించి వెనక్కి తగ్గారు. ఫలితంగా బండి సంజయ్.. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. కరీంనగర్ మేయర్ పీఠంపై బీజేపీ నేతను కూర్చోబెడుతున్నారు.
కార్పొరేషనలో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను దక్కించుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 66 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని 69 మంది కార్పొరేషన ఓటర్లుగా ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడానికి 35 మంది ఓటు వేయాల్సి ఉంటుంది.
అయితే బండి సంజయ్ కు విజయాన్నివ్వకూడదని బీఆర్ఎస్ ముఖ్యులు ప్లాన్ చేశారు. దీంతో కాంగ్రెస్, మజ్లిస్, ఇండిపెండెంట్లు, ఫార్వార్డ్ బ్లాక్ ఇలా అందర్నీ కలుపుకుని రాజకీయం చేయాలనుకున్నారు. క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ కూడా తమ కార్పొరేటర్లను క్యాంప్‌నకు తరలించింది. కానీ ఏ పద్దతిలో ప్రయత్నించినా.. కాంగ్రెస్ తో జతకట్టినట్లు అవుతుంది కాబట్టి అది బీఆర్ఎస్ కు పెనుసమస్యగా మారుతుందన్న హెచ్చరికలు రావడంతో చివరి క్షణంలో బీఆర్ఎస్ డ్రాప్ అయిపోయింది. ఎన్నికకు హాజరు కాకూడదని నిర్ణయించారు. దాంతో బీజేపీ తరపున కొలగాని శ్రీనివాస్ మేయర్ గా ఎన్నిక కావడం ఖాయమయింది.
