ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ అవసరాల కోసం ఓ హెలికాప్టర్ కొనుగోలు చేయాలన్న అంశంపై ఓ కమిటీని నియమించింది. ప్రస్తుతం ఉన్న హెలికాఫ్టర్ విస్తృత వినియోగానికి ఉపయోగపడటం లేదు. దాని స్థానంలో కొత్త హెలికాఫ్టర్ కొనే అంశంపై పరిశీలన చేయాలని అధికారుల కమిటీని నియమించారు. అంతే.. వైసీపీ నేతలు నారా లోకేష్ హెలికాఫ్టర్ కొంటున్నాడని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇదిగో తోక అంటే..ఇదిగో హెలికాప్టర్ అని వైసీపీ సోషల్ మీడియా అందుకుంది.
అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ రెడ్డి తన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల కోసం వందల కోట్లు ధారబోశారు. ఆయన అనంతపురం వెళ్తే.. ఇంటి నుంచి గన్నవరం వెళ్లడానికి హెలికాఫ్టర్. అనంతపురంలో దిగి..ప్రోగ్రాం జరిగే ప్రదేశానికి వెళ్లడానికి మరో హెలికాఫ్టర్. అంటే.. ఒక్క పర్యటనకు రెండు హెలికాప్టర్లు, ఓ ప్రత్యేక విమానం వాడేవారు. ఇలాంటి దుబారా ఖర్చులకు బదులు అత్యాధునిక హెలికాఫ్టర్ ఒకటి కొంటే.. రాష్ట్రం మొత్తం దాంతోనే పర్యటించే అవకాశం ఉండేది. అలాంటి దీర్ఘకాల పెట్టుబడి పెట్టకుండా.. తనకు సన్నిహితులు అయిన ఏవియేషన్ కాంట్రాక్టర్లకు వందల కోట్లు చెల్లించారు.
ఇప్పుడు ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్న సమయంలోనే కొనేస్తున్నారని.. జల్సా అని..దుబారా అని వాగేస్తున్నారు. ఇళ్లపై హెలిప్యాడ్లు నిర్మించుకున్న రాజకీయ నేతలు.. ప్రభుత్వానికి హెలికాఫ్టర్ ఉండవద్దని వాదించడం.. అదేదో తప్పు చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి చెందిన వారు కూడా ఉలిక్కిపడటం విచిత్రంగా ఉంది. ఆ హెలికాఫ్టర్ నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ.. వ్యక్తిగతంగా కొనుగోలు చేయడం లేదు… ఇంకా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన కూడా లేదు. పూర్తిగా ప్రభుత్వ అవసరాల కోసమే కొనాలా లేదా అన్న అంశంపై అధికారుల కమిటీని నియమించారు.