నెత్తి మీద వంద టన్నుల బరువు పెట్టుకొని పరిగెట్టమంటే..?
ఆ బరువు మోయడమే కష్టం. ఇక పరుగెట్టడం కూడానూ. పైగా ఆ పరుగు మామూలు పరుగు కాదు. ఓ రేస్.
ఎన్టీఆర్ ప్రయాణం అలానే మొదలైంది. నెత్తిమీద ‘N…T…R’ అనే కిరీటం ఉంది. చూడ్డానికి అది కిరీటమే. కానీ దాని బరువు టన్నుల కొద్ది.
తాత పేరు.. తాత రూపూ ఉంటే సరిపోదు. ఇంకేదో కావాలి. అది ఎన్టీఆర్ అందివ్వగలడా? అసలు నందమూరి అభిమానుల్ని మెప్పించగలిగే అర్హతలు తనకున్నాయా? ఎన్టీఆర్ ముఖంపై తొలిసారి క్లాప్ కొట్టేముందు ఎదురైన ప్రశ్నలు ఇవి.
‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ ప్రయాణం మొదలైంది.
చూడ్డానికి చాలా బొద్దుగా ఉన్నాడు. హీరో అంటే ఫిట్ గా ఉండాలన్న బేసిక్ రూల్ కూడా ఎన్టీఆర్ దాటలేకపోయాడు. తొలి సినిమాలో ఎన్టీఆర్ ఆహార్యం, నటన పెద్దగా ఎవరికీ ఎక్కలేదు.ఇంకెవరో కొత్త హీరో.. తొలి సినిమాలో ఇలాంటి ప్రదర్శన చేస్తే ‘పోన్లే.. ఇదే తొలి సినిమా. మెల్లగా నేర్చుకొంటాడులే’ అని జాలి చూపించేవారు. కనీసం పాస్ మార్కులు వేసేవారు. కానీ తను ఎన్టీఆర్ మనవడు. ప్రతీ కన్నూ నిశితంగా గమనిస్తుంది. చిన్న విషయాలు పెద్దవిగా తోస్తాయి. అందుకే విమర్శకులు కూడా జాలి చూపలేదు. ఓ రివ్యూలో అయితే ”ఈ సినిమాలో ఐదుగురు విలన్లు.. అందులో హీరో ఒకడు” అని రాసేశారు. ఇంకొకరైతే గుండె పగిలేది. ‘ఇక ఆపేద్దాం’ అనిపించేది. కానీ అక్కడున్నది ఎన్టీఆర్ మనవడు. నందమూరి వారసుడు. ఆ తెగింపు.. ధైర్యం… మొండితనం.. పడిన చోటే లేవాలి, ఓడిన చోటే గెలవాలి అనే పంతం.. అన్నీ ఉన్నవాడు. అందుకే.. ఓటముల నుంచి నేర్చుకొన్నాడు. కొత్త పాఠాలు దిద్దుకొన్నాడు. కట్ చేస్తే… ‘స్టూడెంట్ నెంబర్ వన్’.
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. కానీ క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావుది. పాటల్లో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడైనా సరే, రాఘవేంద్రరావు అనే నీడలోంచి బయటకు రాలేకపోయాడు. ఎన్టీఆర్ డాన్సులు అదరగొట్టాడు. డైలాగ్ డెలివరీలో స్పష్టమైన మార్పు కనిపించింది. తొలి సినిమాతో పోలిస్తే ఆహార్యంలో చాలా మెరుగయ్యాడు. అయినా అక్కడ కూడా పాస్ మార్కులే దక్కాయి. ‘మ్యూజిక్ ప్లస్సయ్యింది.. రాఘవేంద్రరావు మాయాజాలం పని చేసింది’ అనే మాటల మధ్య ఎన్టీఆర్ ప్రతిభ అంతగా మెరవలేదు.
ఆ తరవాత ‘సుబ్బు’. అది ఫ్లాప్. ‘చూశారా? రెండో సినిమా అదృష్టం కొద్దీ ఆడింది’ అని చెప్పడానికి కావల్సిన్ని సాకులు దొరికేశాయి. హీరోగా ఎన్టీఆర్ నిలదొక్కుకోవడం కష్టమన్నది చాలామంది అభిప్రాయం. దాన్ని ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపించే అవకాశం దొరికింది. కానీ ఆ నోళ్లు మూతలు పడడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే… కొన్నాళ్లకు
‘ఆది’ వచ్చాడు.
నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు.. ఈ సినిమాల్లో చూసింది ఈ ఎన్టీఆర్నేనా అనిపించేంత మార్పు. నటన, డైలాగ్ డిక్షన్, యాక్షన్, డాన్స్.. వాట్ నాట్..?? అన్నింట్లోనూ విస్మయపరిచేశాడు. ‘అమ్మ తోడు…’ ఈ సినిమాతోనే మాస్ హీరో అయిపోయాడు. మాస్‌ని మెప్పించడం చాలా కష్టం. కానీ ఒక్కసారి మెప్పిస్తే – స్టార్ గా ఎదగడానికి ఓ మెట్టు పడినట్టే. `ఆది`తో ఒక్క మెట్టు కాదు.. ఒకేసారి ఆరేడు మెట్లు ఎక్కేశాడు ఎన్టీఆర్.
ఆది వేసిన పునాది పై ‘సింహాద్రి’ పెద్ద సామ్రాజ్యమే నిర్మించేశాడు. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అప్పటి వరకూ స్టార్ డమ్ అనుభవించినవాళ్లు, నెంబర్ వన్ రేసులో ఉన్నవాళ్లు కూడా ‘ఈడు బుడ్డోడు కాదు.. బుల్డోజరు’ అని అలెర్ట్ అయ్యారు. ఆ స్థాయిలో ఎన్టీఆర్ ఉజ్వలంగ ప్రకాశించాడు. అక్కడ్నుంచి ఎన్టీఆర్ ప్రయాణం కొత్తగా వివరించడానికీ, వర్ణించడానికీ ఏం లేదు.
నూనూగు మీసాలు కూడా రాకుండానే వచ్చిన స్టార్ డమ్ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ తరవాత ఫ్లాపులు చుట్టుముట్టాయి. మళ్లీ తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ గ్యాప్ లో చాలా మార్పులు జరిగాయి. పడ్డాడు.. బాగా పడ్డాడు… ఇక లేవలేడేమో అనుకొనేన్ని దెబ్బలు తిన్నాడు. కానీ ఎట్టకేలకు లేచాడు. `యమ దొంగ` నుంచి ఎన్టీఆర్ లుక్కే కాదు.. కథల్ని ఎంచుకొనే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్లోని కామెడీ యాంగిల్ ‘అదుర్స్’ తో బయటపడింది. ‘టెంపర్’ నుంచి ఎన్టీఆర్ 2.ఓ దర్శనమిచ్చాడు. అక్కడ్నుంచి ఎన్టీఆర్ ఇంతింతై.. వటుడింతై అన్నట్టు ఎదిగాడు. ఎదుగుతూనే ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. ఇప్పుడు `వార్ 2`తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ కూడా తాను మెరుస్తాడు. ఎందుకంటే.. ఆ ప్రతిభ అలాంటిది.
ఎన్టీఆర్ పేరు పెట్టుకొని, ఆ పేరుకి `చెడ్డ` పేరు రాకుండా కాపాడుకొంటూ వచ్చి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని.. ఓతరానికి ఆదర్శంగా నిలవడం మామూలు విషయమా?
పడిపోతే నవ్వడానికి, ఓడిపోతే నిందించడానికి చాలామంది వెయిట్ చేసే చోట.. గెలిచి, నిలిచి, నిరూపించుకోవడం సామాన్యమైన సంగతా?
ఎవరి కెరీర్ అయినా ఇరవై ఏళ్ల నుంచి మొదలవుతుంది. కానీ ఎన్టీఆర్ ఇరవై ఏళ్ల నాటికే స్టార్. దాన్ని భుజాలపై మోస్తూ, మోస్తూ.. మరో పాతికేళ్ల కెరీర్ నిర్మించుకొన్నాడంటే.. ఆ ప్రయాణం మరొకరికి సాధ్యమా?
ఇన్ని అసాధ్యమైన విషయాల్ని చేశాడు కాబట్టే తాను ఎన్టీఆర్ అయ్యాడు.
ఆ పేరు పెట్టుకోవడానికి తనకంటే అర్హత ఇంకెవరికి ఉంది?
ఇన్నేళ్ల కెరీర్లో తాను సంపాదించుకొన్న అది పెద్ద ఆస్తి… అదే.
ఇప్పటికీ.. ఎప్పటికీ..
హ్యాపీ బర్త్ డే టూ ఎన్టీఆర్!!
యూ ఆర్ ఏ ట్రూ స్టార్!!!