ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీఐడీ అధికారుల విచారణ సాదాసీదాగా జరగడం లేదు. మూలాలను బయటకు తీసేలా సాగుతోంది. అక్రమ సొమ్ము ఏ ఏ రూపాల్లో విదేశాలకు వెళ్లింది… అక్కడి నుంచి ఏ రూపంలో తిరిగి వచ్చిందన్నదానిపైనా స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇందు కోసం సిట్ అధికారులు దుబాయ్ కు కూడా వెళ్లారు. అక్కడ కూడా దర్యాప్తు చేస్తూండటంతో ఇక్కడ లిక్కర్ స్కాంలో పేద ప్రజల రక్త, మాంసాల్ని దోచుకున్న వారందరికీ టెన్షన్ ప్రారంభమవుతోంది.
దుబాయ్ లో కీలక సాక్ష్యాలు సేకరించిన సిట్?
మద్యం స్కాంలో నియమించిన సిట్ ముందుగా హడావుడిచేయలేదు. చాలా పద్దతిగా సాక్ష్యాలు సేకరించింది. డబ్బులు ఎలా వసూలు చేశారు. లంచాలు ఎలా తీసుకున్నారు.. వాటిని ఎలా ట్రాన్స్ పోర్టు చేశార అనే దగ్గర నుంచి అంతిమంగా ఎవరికి చేరాయన్నదానిపై పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పుడు ఆ సొత్తు అంతా ఎక్కడ ఉందో కూడా కనిపెట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాతనే ల అరెస్టులు ప్రారంభించారు. ఇప్పుడు ఆ సాక్ష్యాలకు.. అరెస్టు చేస్తున్న వారు చెప్పే మాటకు మధ్య ఉన్న సారూప్యతను మాత్రమే పరిశీలిస్తున్నారు. కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వారిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు యాంత్రికంగా చెప్పే అవకాశం ఉండదుగా !
వందల కేజీల బంగారం – గని ఎక్కడ?
లిక్కర్ సొమ్ములో దొంగ కంపెనీల ద్వారా త మ కంపెనీల్లో కి మళ్లించుకున్నంత మళ్లించుకున్నారు. మిగతా సొమ్మును బంగారం రూపంలోకి మార్చుకున్నారు. ఈ బంగారం వందల కేజీల్లో ఉంటుందని తేలింది. ఇప్పుడు దాన్ని ఎక్కడ ఉంచారన్నది తెలియాల్సి ఉంది. గాలి జనార్ధన్ రెడ్డి మాదిరిగి ఇంట్లో కుర్చీలు, మంచాలు చేయించుకున్నారా లేకపోతే ఎక్కడైనా నేల మాళిగలో దాచి పెట్టారా అన్నది కూడా తేలాల్సి ఉంది. సిట్ అధికారులకు ఈ గుట్టు కూడా తెలుసని వారు దాన్ని ఎక్కడైనా తరలించాలని చూస్తే వెంటనే పట్టేసుకోవాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.లేకపోతే కేసు కీలక దశకు వచ్చిన తర్వాత సోదాల్లో అయినా పట్టుకుంటారని అంటున్నారు.
లిక్కర్ స్కాం కేసు ఇతర కేసుల్లా కాదు !
మామూలుగా అయితే రాజకీయ నేతలపై వచ్చే కేసులు అరెస్టులతో అయిపోతాయని అనుకుంటారు . ఆ తర్వాత కేసు వాయిదాలు ఉండవు. కానీ.. ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం పక్కా సాక్ష్యాలతో వీలైనంత వేగంగా దొంగల్ని పట్టుకుని ..శిక్షలు వేయించేంత పకడ్బందీగా సాగుతుందని అంటున్నారు. ఇదో కేస్ స్టడీగా మారేలా సిట్ బృందం విచారణ జరుపుతోంది. పోటీగా ఈడీ కూడా రంగంలోకి దిగితే.. ఇక చెప్పాల్సిన అవసరం ఉండదు.