క్రికెట్ ప్రపంచాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చేసింది. ఇప్పుడు ప్రపంచకప్ జరిగినా క్రికెట్ ఫ్యాన్స్ గతంలోలా ఊగిపోవడం లేదు. అంతర్జాతీయ టూర్లు జరిగినా పట్టించుకోవడంలేదు.. కానీ ఐపీఎల్ మాత్రం అదిరిపోతోంది. ప్రతి ఏడాది నెలన్నర పాటు ఐపీఎల్దే రాజ్యం. అయితే ఇది క్రికెట్ కు మేలు చేస్తుందా..కీడు చేస్తుందా అన్నదానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువ ప్రతిభావంతుల్ని వెలికి తీస్తోందని చాలా మంది అంటున్నారు. కానీ అలా వెలికి వచ్చిన వారు ఎంత మంది కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది.
సచిన్, కోహ్లీలు లెక్కలేనంత మంది – వారిని గుర్తించే వ్యవస్థ ఏది ?
భారత దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో అత్యదిక మందికి ఇష్టమైన క్రీడ క్రికెట్. భారత్ లో క్రికెట్ ఓ మతం అని అంటారు. ఏ గల్లీలో చూసినా పిల్లలు క్రికెట్ మాత్రమే ఆడుతూంటారు. ఇలాంటి దేశంలో టాలెంట్ కు కొదవ ఉండదు. ఒక్క సచిన్ టెండూల్కర్..మరో విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. ఇలాంటి వారు లక్షల్లో ఉంటారు. కానీ వారిని గుర్తించి ప్రొత్సహించే మెకానిజమే మన దేశంలో లేదు. అన్ని అవాంతరాలు ఎదుర్కొని వారికి వారే పైకి రావాలి. ఇలా వస్తున్న వారు ఐపీఎల్ లో కనిపిస్తున్నారు. ప్రతిభ చూపుతున్నారు.
ఐపీఎల్లో వెలుగులోకి వస్తున్న ప్రతిభ – కానీ నిలబెట్టుకునేదెలా ?
గతంలో ఓ క్రికెటర్ తన ప్రతిభ చూపించి పైకి రావాలంటే ముందు అండర్ ఏజ్ టోర్నీల్లో ఆడాలి. తర్వాత రంజీల వరకూ వివిధ టీముల్లో చోటు దక్కించుకోవాలి. ఇందు కోసం సెలక్షన్ టెస్టుల్లో పాసవ్వాలి. ఆ తర్వాత ప్రతిభ చూపాలి. ఇందులో ఎన్నో రాజకీయాలు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఇష్టమైన ప్లేయర్లను తీసుకునేందుకు అవకాశం ఉంది. అందుకే .. కింది స్థాయిలో ప్రతిభ చూపుతున్న వారిని ఎంపిక చేసుకుని అవకాశాలు ఇస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ముజిబుర్ రెహ్మాన్, ప్రదీప్ సంగ్వాన్, ప్రయాసే ర్ బర్మన్ వంటి ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో సత్తా చాటారు. కానీ వీరంతా పదిహేడేళ్లలోపు వాళ్లే.
యువ ప్రతిభపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టాలి !
గతంలోనూ చాలా మంది ఐపీఎల్ లో ప్రతిభ చూపారు. కానీ ఎంత మంది జాతీయ జట్టులోకి వచ్చారన్నదే ప్రశ్నార్థకం. చిన్న వయసులో వారికి వస్తున్న పేరు .. వారిపై తీవ్ర ఒత్తిడికి కారణం అవుతోంది. అదే సమయంలో వచ్చి పడుతున్న క్రేజ్, డబ్బు కారణంగా ఏకాగ్రత కోల్పోతున్నారు. ఫలితంగా కెరీర్ లు ముగిసిపోతున్నాయి. ఇలాంటి వారికి మానసిక శక్తి ఇచ్చి.. కెరీర్ ను గాడిన పెట్టేందుకు బీసీసీఐ ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.