చిత్రసీమ ఎంత ప్రేమ పంచుతుందో, అంతే నిర్దాక్షణ్యంగా కూడా ఉంటుంది. వరుస ఫ్లాపులు ఎదురైతే, అవకాశాల మాట అటుంచి, పలకరించేవాడే కరువైపోతాడు. కొంత గ్యాప్ వస్తే – ఇక అదే కంటిన్యూ అవుతుంది. మళ్లీ ఫేమ్ లోకి రావడం, ఫామ్ సంపాదించడం దాదాపు పునఃజన్మ ఎత్తడమే. మంచు మనోజ్ విషయంలోనూ అదే జరుగుతోంది. మనోజ్ ఓ ఎనర్జీ పొట్లాం. హుషారుగా ఉంటాడు. డాన్సులూ, ఫైట్స్, డైలాగ్ డెలివరీ విషయాల్లో తనదంటూ ఓ ముద్ర వేశాడు. తను స్టంట్ మాస్టర్ కూడా. పాటలూ పాడేస్తుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో.. మంచివాడన్న పేరు సంపాదించుకొన్నాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని హిట్లు వచ్చాయి. తన సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయన్న క్రెడిట్ దక్కింది.
కానీ వరుస ఫ్లాపులు మనోజ్‌ని కుదిపేశాయి. వ్యక్తిగత జీవితం కూడా తిప్పలు పెట్టింది. పెళ్లి – విడాకులు – మళ్లీ పెళ్లి… ఇలా సాగింది సంసారం. కొన్నాళ్లు ఎవ్వరికీ కనిపించలేదు. మళ్లీ కెరీర్ మొదలెట్టాలని ఓ సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. కానీ మధ్యలో ఆగిపోయింది. మరో సినిమా మొదలెడితే… దాని కథ కూడా అంతే. జేబులు, బ్యాంక్ అకౌంట్లూ అన్నీ ఖాళీ అయిపోయాయి. హీరో నుంచి జీరో అయిపోయాడు. దానికి తోడు ఇంటి గొడవలు మనశ్శాంతి లేకుండా చేశాయి… చేస్తున్నాయి. అయిన వాళ్లతో రోజూ ఓ యుద్ధమే చేస్తున్నాడు. అయితే మనోజ్ అలసిపోలేదు. ఎనర్జీ ఎక్కడా వదులుకోలేదు. కన్నీళ్లు ఆపుకొని, బాధని మింగుకొని, మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. ఇప్పుడు ‘భైరవం’ అనే సినిమా చేశాడు. ఈనెల 30న ఈ సినిమా విడుదల అవుతోంది. ‘మిరాయ్’లోనూ తనకు మంచి పాత్రే దక్కింది. ఈ రెండు సినిమాలూ తన కెరీర్‌ని నిలబెడతాయన్న ఆశతో ఉన్నాడు మనోజ్.
‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన కన్నీళ్లను ప్రేక్షకులకూ పరిచయం చేశాడు. మనోజ్ స్పీచ్ తరవాత తనపై సాఫ్ట్ కార్నర్ ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యింది. ‘మనోజ్‌కి ఓ హిట్టు పడితే బాగుణ్ణు’ అన్నది అందరి ఆశ. మనోజ్ కూడా ఇదే నమ్ముతున్నాడు. ఎవరు చెప్పగలరు? ఒక్క సినిమా జీవితాల్నే మర్చేస్తుంది. మళ్లీ మనోజ్ ఫామ్ లోకి రావడానికి, వరుస సినిమాలు చేయడానికీ, తన ఎనర్జీని ప్రేక్షకులకూ అందివ్వడానికి… ఒక్క హిట్టు చాలు.
ఈరోజు మనోజ్ పుట్టిన రోజు. ఓరకంగా ఇది పునః జన్మ అనుకోవాలి. ఇక్కడి నుంచి తన కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం మరిన్ని విజయాలకు నాంది కావాలి. హ్యాపీ బర్త్ డే టూ మనోజ్!!