తనకు ప్రాధాన్యత దక్కడం లేదని అనంతపురం మహానాడులో ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఇదే కాదు.. రెండు, మూడు సందర్భాల్లో తాను పార్టీ విజయం కోసం..పార్టీ కోసం సర్వం త్యాగం చేసి పని చేశానని కానీ తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ కొంత మంది ఇదే పని చేశారు. ఈ కారణంగా టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి అనే ప్రచారం పెరగడానికి కారణం అవుతోంది. దీన్ని ఎలా కవర్ చేయాలో.. ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.
ప్రాథాన్యతకు కొలమానం ఏమిటి?
పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎవరైనా కార్యకర్త .. పార్టీ సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేస్తే..అతనికి ప్రాధాన్యత లభించదు. కానీ పార్టీపై వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అసలు ప్రాధాన్యత అనేది దానికి ఎంటి కొలమానం అనేదానికి స్పష్టతలేదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్తకు పార్టీలో నియోజకవర్గ స్థాయి పదవి ఉంది.కానీ ఆయన ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దాన్ని పార్టీ నేతలు తీర్చలేకపోయారు. ఈ ఒక్కరికే కాదు.. చాలా మందికి అదే అభిప్రాయం ఉంటుంది.
పార్టీని మేమే గెలిపించామని అనుకునేవారితోనే సమస్య
టీడీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. వారంతా కలసి కట్టుగా పని చేసి పార్టీని గెలిపించుకున్నారు. తమకు ప్రాధాన్యత లభిస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. పార్టీలో పైకి రావాలంటే..చచ్చిపోతామన్న బెదిరింపుల వల్ల సాధ్యం కాదు. అనేక మంది పదవులకోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే తమ వల్లే పార్టీ గెలిచిందని తామే గట్టిగా పని చేశామని అనుకునేవారితోనే సమస్య వస్తోంది. తమను గుర్తించాలని.. తీసుకెళ్లి పీఠంపై కూర్చోబెట్టాలని వారు అనుకుంటారు. అనుకున్నది దక్కకపోయే సరికి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు.
ఎమ్మెల్యేల నిర్లక్ష్యమూ కారణమే !
రాజకీయంలో వర్గ పోరాటం కామన్. అయితే కార్యకర్తల విషయంలో మాత్రం ఈ తేడాలు చూపించకూడదు. కానీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తల విషయంలో తేడాలు చూపిస్తున్నారని..తమ వర్గం కాకపోతే దూరం పెడుతున్నారని అంటున్నారు. పనులు చేయించే విషయంలో తేడాలు చూపించకూడదని .. టీడీపీ కార్యకర్త అయితే పనులు చేయాలని.. చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఉన్న చోట్ల.. కార్యకర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది ఎమ్మెల్యేలే.