అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ ఈ సారి ఏపీకి వస్తున్నారు. అది కూడా విశాఖలో కార్యక్రమం చేశారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించారు. ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు కోట్ల మంది యోగా చేసేలా ఏర్పాట్లు
ప్రధాని మోదీతో కలిసి యోగా దినోత్సవంలో యోగా చేసేందుకు.. రెండు కోట్ల మంది సిద్ధమవనున్నారు. నేరుగా ఐదు లక్షల మంది మోదీ తో పాటు యోగా చేయవచ్చు కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గ కేంద్రం.. పట్టణాలు… మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ యోగా డేను నిర్వహిస్తారు. దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజున యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తారు. ఇది ప్రపంచ రికార్డు అవుతుందన్న అంచనా ఉంది.
ఆరోగ్యానికి యోగా ముఖ్యం
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ప్రజల్ని చుట్టుముడుతున్నాయి. వ్యాయామం చేసే సమయం ఉండటం లేదు. ఇలాంటి వారికి యోగా ఓ అద్భుతమైన సాధనంగా ఉంది. దీన్ని నేర్చుకుని రోజువారీ సాధన చేసేవారు పెరుగుతున్నారు. యోగాకు మరింతగా ఆదరణ వచ్చేలా చేసి.. అందరూ యోగా సాధన చేసేలా చేస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చంద్రబాబు ఆలోచన. అందుకే ఈ యోగాడేను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
గతంలోనూ యోగా, ధ్యానానికి చంద్రబాబు ప్రోత్సాహం
యోగా విషయంలో చంద్రబాబు మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో రోజువారీ దినచర్యలో యోగా ఓ భాగంగా ఉంటుంది. దశాబ్దాల క్రితమే.. పార్టీలోని ముఖ్య నేతలకు.. అధికార యంత్రాంగానికి యోగా క్లాసులు ఇప్పించారు. ఇషా ఫౌండేషన్ తో ధ్యానకార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇలాంటివి మేలు చేస్తాయని.. శారీరక ఆరోగ్యం, మానసిక శాంతికి దోహదపడతాయని చంద్రబాబు నమ్ముతారు. అందుకే మోదీ ముఖ్య అధితిగా వస్తున్న కార్యక్రమంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.