కేసీఆర్ కు కవిత పేరుతో రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. లేఖ నిజంగా ఆమె రాసిందా? లేదంటే కవిత పేరుతో ఇతరులు రాశారా?… ఇతరులు రాస్తే కవిత పేరుతో లీక్ చేసింది ఎవరు? అలా చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది?
నో డౌట్.. తెలంగాణ రాజకీయాల్లో కవిత లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె కేసీఆర్ కు రాసిందని చెబుతున్న లేఖ వైపు రాష్ట్ర రాజకీయాలు టర్న్ అయ్యాయి. లేఖ ఆమె రాసిందా అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. కవిత ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉండటంతో ఆమె వచ్చాక క్లారిటీ రానుంది. అంతలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. దీన్ని ఆలోచించి అయినా బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు ? ఈ విషయంపై స్పందిస్తే ఇష్యూ మరింత పెద్ది అవుతుందన్న ఆందోళనా?
కవిత లెటర్ పై ఎవరూ మాట్లాడటం లేదు. ఏం మాట్లాడితే ఏం అవుతుందని అందరూ మౌనం వహిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ , బీజేపీ నేతలు మాత్రం బలంగా తమ వాణిని వినిపిస్తున్నారు. ఈ లేఖను రేవంత్ బయటకు వదిలారని బీజేపీ ఆరోపిస్తుంటే..బావ , బామ్మర్దులు కలిసి కవితను బయటకు పంపే ప్లాన్ తో ఈ లేఖను రిలీజ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కవిత లేఖ రేవంత్ రెడ్డి వదిలిన బాణమని, ఆమె రెండో షర్మిల కాబోతుంది అంటూ రఘునందన్ రావు చెప్పారు.
ఏదీ ఏమైనా, బీఆర్ఎస్ పై కవిత అసంతృప్తితో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. అంతమాత్రానా ఆమె పార్టీని వీడుతుందా? అన్నయ్య చేసిన మోసంతో షర్మిల వేరు కుంపటి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఫలితం లేకుండా సొంత పార్టీని మూసేసుకుంది. ఇప్పుడు కవిత కూడా వేరు కుంపటి ఏర్పాటు చేస్తే అదే జరుగుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె అలాంటి సాహసం చేయపోవచ్చునని అంటున్నారు.
మరోవైపు ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ లో తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు కవిత ఈ స్ట్రాటజీ ప్లే చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చాక కవిత బీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు. పైగా ఆమెను రాజకీయాలు విరమించుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారన్న ప్రచారం నడిచింది. వీటిని కూడా ఆపేయాలని ఆమెకు సూచించారని… అయినా ఆమె వినడం లేదని ఊహాగానాలు వచ్చాయి. వీటన్నింటిని తండ్రికి చెప్పుకుందామంటే అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకోవాలనే, వ్యూహాత్మకంగా కవిత తన అనుచరుల ద్వారా లేఖను లీక్ చేయించిందని అంటున్నారు. ఎందుకంటే ఆమె అమెరికా నుంచి వచ్చాక తండ్రి నుంచి ఖచ్చితంగా పిలుపు వస్తుందని, అప్పుడు తన రాజకీయ పంథాను తండ్రికి వివరించి, తనపై జరుగుతూన్న కుట్రలను వివరించే వ్యూహమే ఈ లేఖ సారాంశం అని అంటున్నారు.