తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తేలడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ ఎవరికీ సంతృప్తి లేదు. మంత్రి పదవుల భర్తీ లేదు, నామినేటెడ్ పోస్టుల్లేవు.. కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. హైకమాండ్ కూడా ఎప్పట్లాగే కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ గ్రీన్ సిగ్నల్ వస్తుందా అన్నది మాత్రమే ఎవరికీ అర్థం కావడం లేదు.
మంత్రి పదవుల కోసం భారీ రేస్
ఖాళీ ఉన్నది ఆరు మంత్రి పదవులు. కానీ పోటీ పడుతున్న వారు ఇరవై మంది వరకూ ఉన్నారు. ఇంకా మిగిలిన వారూ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చాన్స్ రాదని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలంటే.. జిల్లాలు, సామాజికవర్గాలను సమన్వయం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆశలు పెంచుకున్న పార్టీ నేతలకు అవకాశం ఇవ్వలేరు. అలా ఇవ్వకపోతే వారు చేసే రచ్చ పార్టీని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఏడాదిగా మంత్రి పదవుల భర్తీ అంశాన్ని పక్కన పెట్టేశారు.
కనీసం నామినేటెడ్ పోస్టుల భర్తీ అయినా ?
కాంగ్రెస్ క్యాడర్ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. పార్టీని నమ్ముకున్న వాళ్లు.. తమకు ఏదో ఓ పదవి వస్తుందని ఆశ పడుతున్నారు. ఈ అశ ఇలా కొనసాగుతూనే ఉంది. కొన్ని పదవులు ప్రకటించినా ఇంకా మెజార్టీ పదవుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇందు కోసం కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ ఫార్ములాను రెడీ చేశారు. దానిపై కసరత్తు చేశారు. పదవుల పేర్లతో షార్ట్ లిస్టు కూడా రెడీ అయిందని చెప్పుకున్నారు. కానీ ప్రకటన మాత్రం రావడం లేదు.
పార్టీపదవులపైనా అదే నాన్చుడు
పీసీసీ చీఫ్ ను నియమించారు కానీ ఇప్పటి వరకూ కార్యవర్గం లేదు. మంత్రి పదవులకు, నామినేటెడ్ పోస్టులకు లింకు పెట్టి అక్కడ చాన్స్ దక్కని వారికి పార్టీ పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడా కసరత్తులు చేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే.. ముందుగా క్యాడర్ కు పదవులు ఇవ్వాలి. ఎంత ఆలస్యం చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వాన్ని ఎంత బలంగా ఉంచితే.. వారు పదవుల పంపకం తర్వాత ఏర్పడే సమస్యల్ని అంతగా కవర్ చేస్తారు. కానీ ఈ రెండు విషయాల్లోనూ హైకమాండ్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.