బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించి చాలా వారాలైంది. ప్రతీవారం ఏవో కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ, ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం లేదు. ఈవారం మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి బాలీవుడ్ సినిమా. ‘కుబేర’, ‘8 వసంతాలు’ తెలుగు నుంచి విడుదల కాబోతున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఏ క్లాస్ లో శేఖర్ సినిమాలంటే టికెట్లు బాగా తెగుతాయి. ఈసారి ఆయన బీ,సీలనూ టార్గెట్ చేస్తూ సినిమా తీసినట్టు అనిపిస్తోంది. కుబేరలో అన్ని వర్గాలకు కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ధనుష్, నాగ్… ఈ కాంబోనే ఇంట్రస్టింగ్ గా ఉంది. నాగ్ కూడా తన కెరీర్లో భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎలా చూసినా.. ‘కుబేర’ మంచి ఓపెనింగ్ తీసుకొనే ఛాన్సుంది.
కాకపోతే ఈ సినిమాకు బజ్ ఉన్నా, ప్రమోషన్లు ఆశించినంత వేగంగా లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటి చేశారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలూ ప్రస్తుతానికి లేవు. మూడుగంటల నిడివి కూడా కాస్త భయపెడుతోంది. తమిళంలో ప్రీ బుకింగ్స్ బాగున్నా, వాళ్లు ఈ సినిమాని ఎంత వరకూ రిసీవ్ చేసుకొంటారన్నది ప్రశ్న. ఈ సినిమాని వాళ్లు డబ్బింగ్ బొమ్మగానే భావిస్తే వసూళ్లలో ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈవారం 8 వసంతాలు విడుదల కాబోతోంది. ఇదో ఫీల్ గుడ్ ప్రేమకథ. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. లవ్ స్టోరీలు కోరుకొనేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. మైత్రీ మూవీస్ నిర్మించింది కాబట్టి, థియేటర్లకు కొదవ లేకపోవొచ్చు.
అమీర్ ఖాన్ ‘సితారే జమీన్పర్’ కూడా ఈవారమే విడుదల కానుంది. అమీర్‌కు చాలా కీలకమైన సినిమా ఇది. చాలా కాలంగా ఆయనకు ఫ్లాపులే తగులుతున్నాయి. ఓటీటీకి సినిమా అమ్మకుండా ఆయన పట్టుదల చూపించారు. వచ్చే ఆదాయం థియేటర్ల నుంచే రావాలి. చిన్న సినిమానే కాబట్టి నిర్మాతగా అమీర్ సేఫ్ అవ్వొచ్చు. కానీ ఆయనకు ఇప్పుడు పెద్ద హిట్ అవసరం. సౌత్ లో అమీర్ అస్సలు ప్రచారమే చేయలేదు. అసలు ఈ సినిమా వస్తోందన్న విషయమే ఇటువైపు తెలీదు. దాంతో సౌత్ లో ఈ సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.