‘కన్నప్ప’ శుక్రవారం విడుదలైంది. అద్భుతం.. అమోఘం అనలేం కానీ, డీసెంట్ ఎఫెక్ట్. మంచు విష్ణు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకొంది. అది కూడా ప్రభాస్ ఎంట్రీ వల్ల. శుక్రవారం థియేటర్లు కళకళలాడాయి. ఆ ఊపు శని, ఆదివారాలూ కనిపించే అవకాశం వుంది. అయితే చిత్రబృందం నుంచి ఓ పోస్టర్ వచ్చింది. ‘ఇండస్ట్రీ హిట్’ అంటూ ఘనంగా ప్రకటించుకొన్న పోస్టర్ అది.
ఇండస్ట్రీ హిట్ అంటే ఏమిటో మంచు ఫ్యామిలీకి తెలియంది కాదు. గత రికార్డులన్నీ తిరగరాసిన సినిమా అని. తొలి రోజే ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించుకోవడం ఓ దుస్సాహాసమే. అంటే బాహుబలి, పుష్ప రికార్డుల్ని తిరగరాసినట్టేనా? తొలి రోజే అంత ధీమానా? అంటూ కౌంటర్లు మొదలెట్టేశారు నెటిజన్లు.
ఈ సినిమాతో విష్ణుపై కాస్త గౌరవం పెరుగుతుంది. ట్రోలింగ్ తగ్గుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన సినిమాకు ఇలాంటి పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కూడా చాలా ఏళ్లయ్యింది. ఇలాంటప్పుడే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పోస్టర్లు వేస్తే మళ్లీ ట్రోలింగులు మొదలైపోతాయి. కనీసం ఫస్ట్ డే ఇంత వసూలు చేశాం అని చెప్పుకొన్నా బాగుండేది. అలాంటి అంకెలేం లేకుండా ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా? ఈరోజు సాయింత్రం ‘కన్నప్ప’ థ్యాంక్స్ మీట్ వుంది. అక్కడ తొలి రోజు వసూళ్ల గురించి విష్ణు ఏమైనా చెబుతాడేమో చూద్దాం.