ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా వైసీపీ మూక చేస్తున్న ప్రయత్నాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బయట పెట్టారు. ఏపీలో ఇన్వెస్ట్ చేయవద్దని పెట్టుబడిదారులకు దాదాపుగా రెండు వందల మెయిల్స్ ను ఉమాశంకర్ అనే వ్యక్తి పంపారన్నారు. ఈ ఉమాశంకర్ వెనుక జగన్, బుగ్గన ఉన్నారని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తరవాత నేరుగా వైసీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డితోనూ లేఖలు రాయించారని పయ్యావుల మండిపడ్డారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదని .. మేం పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. నీ ఏడుపు ఇంకెంతకాలం అని జగన్ ను ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉంటే వైసీపీ వ్యూహాల్లో ఈమెయిల్స్ ఒకటి. గతంలో అమరావతికి పెట్టుబడులు పెట్టవద్దని పెద్ద ఎత్తున మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేశారు. దాంతో పలుమార్లు వారు చేసిన ఫిర్యాదుల్లో నిజం ఏమిటో తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంక్ బృందాలు వచ్చాయి. అవన్నీ ఫేక్ మెయిల్స్ అని తెలిసి రుణం మంజూరు చేశారు. అప్పుడే ప్రభుత్వం మారడంతో ఆ రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోలేదు. జగన్ రెడ్డి అమరావతిని అడవిని చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ లేఖలు రాశారు. కానీ ఈ దొంగ మెయిల్స్ ను ప్రపంచ బ్యాంక్ పట్టించుకోలేదు.
ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి.. ఆ పెట్టుబడుల్ని ఏపీకి రాకుండా చేసేందుకు వైసీపీ ఘోరమైన కుట్రలకు పాల్పడుతోంది. రాజకీయాల కోసం ఏపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. రాష్ట్రద్రోహం చేసేందుకు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడులు వస్తే.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అది వైసీపీకి ఇష్టం లేదు. ప్రజల్ని నిరుద్యోగులుగా ఉంచి.. ఉపాధి లేకుండా చేసి.. వారితో రాజకీయాలు చేయాలనుకుంటోంది. కానీ వైసీపీ నేతల క్రిమినాలజీపై ఇప్పటికే అందరికీ స్పష్టత ఉంది. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి భయపడి కొంత మంది వెనుకడుగు వేసినా.. అది ఏపీకి నష్టమే అవుతుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.