హైదరాబాద్లో వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీకి షర్మిల లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల గుండెల్లో YSR గారిది చెరగని ముద్ర వేశారని.. మహానేత మరణించి 16 ఏళ్లు దాటినా ఆయన వర్ధంతి, జయంతి వేడుకలకు నివాళులు అర్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో మెమోరియల్ లేకపోవడం బాధాకరమన్నారు. YSR మరణానంతరం అనాడు మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కాకుండా పోయిందని ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని సోనియాను కోరారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ పంపినట్లుగా షర్మిల చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో చనిపోయారు. ఆయన గతంలో వ్యక్తం చేసిన కోరిక మేరకు.. ఇడుపులపాయ ఎస్టేట్ లోనే అంత్యక్రియలు చేశారు. అక్కడే ప్రభుత్వ ధనంతోనే మెమోరియల్ నిర్మించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడ మమోరియల్ లేదన్న భావన ఎవరికీ రాలేదు. వైఎస్ కుటుంబీకులు అంతా ఇడుపులపాయకు వెళ్లి నివాళులు అర్పిస్తారు.
అయితే ఇప్పుడు జగన్, షర్మిలకు విబేధాలు వచ్చాయి . ఒకరినొకరు ఎదురుపడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. జగన్ ఘోరంగా మోసం చేశాడని షర్మిల రగిలిలిపోతున్నారు. షర్మిల కుమారుడి పెళ్లికి జగన్ దంపతులు వెళ్లలేదు. ఈ క్రమంలో.. వారి మధ్య పూడ్చలేని ఆగాధం ఏర్పడింది. హైదరాబాద్లో మెమోరియల్ ఉంటే… జగన్ ఉన్నప్పుడు ఇడుపులపాయకు వెళ్లాల్సిన అవసరం ఉండదని షర్మిల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.