డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో పునర్విచారణకు కోర్టు అనుమతించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగనుంది. ఈ హత్య తానే చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. అయితే ఎందుకు హత్య చేశారు.. ఒక్కడే చేశాడా.. అతనికి ఎవరు సహకరించారు.. అన్నదానిపై ఎలాంటి వివరాలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హత్య చేయడంతో మీడియాలో హడావుడి జరిగింది కాబట్టే కేసు నమోదు చేశారు. తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారు. నిజానికి అసలు దర్యాప్తు చేయలేదు. అనంతబాబు చెప్పింది రాసుకుని అదే ఫైనల్ చేసుకున్నారు.
చివరికి చార్జిషీటు కూడా దాఖలు చేయకపోవడంతో ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలను కాంగ్రెస్ నేత హర్షకుమార్ సహా ఎంతో మంది వ్యక్తం చేశారు. ఇప్పుడు హర్షకుమార్ లాంటి వాళ్లు నోరు మెదపడం లేదు కానీ.. ప్రభుత్వం మాత్రం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చింది. న్యాయం చేస్తామని చెప్పింది. అందుకే వారికి న్యాయ సాయం అందించేందుకు ప్రముఖ లాయర్ ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. కోర్టు నుంచి పునర్విచారణకు అనుమతి వచ్చేలా లాయర్ వాదించారు.
ఇప్పుడు ఈ కేసులో మొదటి నుంచి విచారణ జరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు ఈ హత్య జరిగింది.. అనంతబాబు చేసిన సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమిటి.. హత్యకు సహకరించిన వారు ఎవరు.. హత్య చేసిన తర్వాత ఒక్కడే మృతదేహాన్ని అటూ ఇటూ కదపడం…కారులో ఎక్కించడం అసాధ్యం.. ఇలాంటి వాటిలో పాల్గొన్న వారెవరు అన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. అందుకే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.