ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వలేదంటూ తిరుపతి రోడ్డుపై ధర్నా చేసిన మోహన్ బాబుకు .. సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ట్రయల్ జరగాలన్న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆయన పెట్టిన సెక్షన్లకు.. చేసిన నిరసనలకు సంబంధం లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ కేసును కొట్టి వేయడంతో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులకు రిలీఫ్ వచ్చింది.
మోహన్ బాబు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ధర్నా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్ మెంట్ అంటూ.. విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కాల్సిన అవసరం లేదు. కేవలం టీడీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, జగన్ పన్నిన వ్యూహంలో భాగంగానే ఆయన ధర్నా చేశారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘన కేసులు పెట్టారు.
ఆ ధర్నా అయ్యాక.. హైదరాబాద్ వెళ్లి వైసీపీ కండువా కప్పించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనను పట్టించుకోకపోవడంతో సైలెంట్ అయ్యారు. తర్వాత కోర్టు విచారణకు ఓ సారి తిరుపతిలో హాజరయ్యి.. తాను మోదీ మనిషినని ప్రకటించుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇటీవల కుమారుడు మనోజ్ వ్యవహారంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న ఆయనకు ఈ కేసులో రిలీఫ్ ఊరటే అనుకోవచ్చు.