జాతీయ అవార్డులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకి ఆమడ దూరంలో ఉండే అవార్డ్ జ్యూరీ ఇప్పుడు ఆర్ట్, కమర్షియల్, మాస్ మసాలా సినిమాలని ఒక్క తాటిపైకి తెచ్చి అవార్డులు ప్రధానం చేస్తోంది. అంతేకాదు.. కమర్షియల్ సినిమాలకి పెద్దపీట వేస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన అవార్డ్స్‌లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడు విషయంలో జ్యూరీ నిర్ణయం చర్చనీయాంశంగా ఉంది.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి పంచారు. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)ని ఎంపిక చేశారు. ఇది చర్చకు తావిచ్చే ఎంపికగానే భావించాలి. ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’కు అవార్డు దక్కింది. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే నటన వందశాతం జాతీయ అవార్డుకు అర్హం. కానీ జ్యూరీ ఇంకాస్త కమర్షియల్‌గా ఆలోచించింది. జవాన్‌లో నటనకి గాను షారుక్ పేరుని కూడా తగిలించేసింది. నిజానికి ఈ ప్రకటన షారుక్ అభిమానులు ఊహించి ఉండరు.
ఇక్కడ షారుక్ ఖాన్‌కి, విక్రాంత్ మస్సే నటనకు పోలిక పెట్టడం లేదు. ఇండియన్ సినిమాల్లో షారుక్ లెజెండ్. ఆయనకి ఆయనే సాటి. ఆయన నటనకి, సంపాదించుకున్న అభిమానులకు అవార్డులు గీటురాళ్లే కావు. అయితే నేషనల్ అవార్డుకు ఒక ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఒక పాత్ర పోషించినందుకు అవార్డు ప్రకటిస్తే.. ఆ పాత్రలోని గొప్పదనం ఏమిటనేది చూస్తారు. ఇలా జవాన్ సినిమాకి అవార్డు వచ్చినప్పుడు.. ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘స్వదేశ్’, ‘చక్‌దే! ఇండియా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘బాజీగర్’, ‘దేవదాస్’… ఈ చిత్రాలన్నింటిలో షారుక్ ఖాన్ పోషించిన పాత్రలన్నీ అయోమయంగా చూస్తున్న పరిస్థితి.
ఇంకా సర్ప్రైజ్ ఏమిటంటే… కొన్ని జనరేషన్స్‌కి వెండితెర ఇలవేల్పుగా నిలిచే షారుక్‌కి ఇప్పటివరకు నేషనల్ అవార్డు లేదు. ఇదే ఆయన ఫస్ట్ నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు జ్యూరీ ఎంత చిత్ర విచిత్రంగా పని చేస్తుందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ.
నాటునాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత ఓ సందర్భంలో ‘‘నేను చేసిన చాలా మంచి పాటలు ఉన్నాయి. ఆస్కార్ ఈ పాటకి వచ్చింది’’ అని ఓ శ్లేషాలంకారం వాడారు కీరవాణి. 33 ఏళ్ల నట జీవితంలో తొలిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న షారుక్ పరిస్థితి కూడా ఇదే.
ఏదేమైనా నేషనల్ అవార్డు జ్యూరీ మాస్ కమర్షియల్ సినిమాలనూ అంగీకరిస్తున్న ట్రెండ్‌కి ఇది ఉదాహరణగా నిలిచింది. చాలా మంది మేటి కళాకారులు అసలు జాతీయ అవార్డు లేకుండానే కెరీర్‌ని ముగించేస్తారు. ‘బలగం’ సాహిత్యానికి అవార్డ్ వచ్చిన సందర్భంలో ఒక్కసారి తెలుగు సినిమా సాహిత్యాన్ని సింహాలోకనం చేసుకుంటే… సిరివెన్నెల సీతారామశాస్త్రికి జాతీయ అవార్డు లేదని తెలిసాక… త్రివిక్రమ్ లా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో సినిమా, పాత్ర ఏదైనా అయినా సరే షారుక్ ఖాన్ లాంటి నిబద్ధత కలిగిన కళాకారుడికి కాస్త ఆలస్యంగానైనా జాతీయ అవార్డు ఇవ్వడం సముచిత గౌరవంగానే చూడాలి.
కొసమెరుపు:
షారుక్ ఎలాంటి నటుడో తెలియపరిచే ‘స్వదేశ్’ సినిమాలో ఓ చిన్న సీన్..
మోహన్ (షారుక్)ప్రయాణిస్తున్న ట్రైన్ ఓ స్టేషన్ వద్ద ఆగుతుంది. స్కూల్లో ఉండాల్సిన ఓ పసిపిల్లాడు స్టేషన్లో ”పానీ పానీ”అని కేకలు వేస్తూ చిన్న కెట్టిల్‌లో నీళ్లు అమ్ముతుంటాడు. గ్లాస్ నీళ్లు తీసుకుని, పిల్లాడి చేతిలో డబ్బులు పెడుతున్నప్పుడు… అప్రయత్నంగా మోహన్ కళ్లలో జారే కన్నీళ్లు.. బాధ, ఆక్రోశం, కోపం, ఆవేదన, ఏం చేయలేనితనం… ఇలా ఎన్నో ఎమోషన్స్‌ని ఐదు సెకన్లలో షారుక్ పలికించిన తీరు మెమరబుల్.