ఆటలో పోరాడాల్సింది ప్రత్యర్థిపైనే కానీ అంపైర్లపై కాదు. అంపైర్లతో పోరాడితే పిచ్చి వాళ్లనుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయ ఆటలో బీజేపీ కన్నా ఎన్నికల సంఘంతోనే ఎక్కువగా పారాడుతోంది. బెదిరించేందుకు.. బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆరోపణలు చేస్తోంది. తాము వచ్చాక ఎవర్నీ వదలబోమని చిన్న స్థాయి రాజకీయ నాయకుడి మాదిరిగా రాహుల్ బెదిరిస్తున్నారు. తమ దగ్గర ఉన్నాయంటున్న సాక్ష్యాలు మాత్రం బయట పెట్టడం లేదు. దీంతో ఈసీని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారన్న విషయం అర్థమైపోతుంది.
మొన్నటిదాకా ఈవీఎంలు.. ఇప్పుడు ఓటర్ల జాబితాలా ?
ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతీ సారి ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈవీఎంలు లేకపోతే బీజేపీ ఎప్పటికీ గెలవలేదని కబుర్లు చెబుతూ ఉంటారు. ఈవీఎంలపై ఎన్నో సార్లు కోర్టులకు వెళ్లారు. అయితే ఇప్పుడు వారు ఈవీఎంలపై కాకుండా ఓటర్ల జాబితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్లను చేర్చి బీజేపీ గెలుస్తోందని వాదన వినిపిస్తోంది. తమ దగ్గర అణుబాంబుల్లాంటి సాక్ష్యాలున్నాయని చెబుతున్నారు. ఉంటే బయట పెట్టడానికి ఇంత కన్నా గొప్ప సమయం ఏమి ఉంటుందని వస్తున్న ప్రశ్నలకు మాత్రం సౌండ్ ఉండటం లేదు.
బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై అన్నీ తప్పుడు ఆరోపణలే !
బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి… ఆగస్టు ఒకటో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. అయితే తమ ఓటు గల్లంతయిందని ఫిర్యాదు చేస్తున్న వారు దాదాపుగా లేరు. తన ఓటు పోయిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. కానీ అది ఫేక్ ఓటు. ఈసీ జారీ చేసింది కాదు. ఆయన ఓటు వేరే ఉంది. అది ఆయనకూ తెలుసు. గత ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తన అసలు ఓటునే అఫిడవిట్ లో పెట్టారు. మరీ తాను మీడియా సమావేశంలో చూపించిన రెండో ఫేక్ ఓటు ఎక్కడి నుంచి వచ్చింది. ఇలాంటి ఫేకుల్ని ఏరి పారేయడానికే ఈసీ SIRని తెచ్చింది. దాన్ని తప్పు పట్టి ఏం సాధించాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీకే తెలియాలి.
ఎన్నికల సంఘంపై దాడి చేస్తే ఏ రాజకీయ ప్రయోజనమూ రాదు !
ఎన్నికల నిర్వహణ అంశంలో ఎన్నికల సంఘం పై విమర్శలు చేయవచ్చు. కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. ఆధారాలతో ఉండాలి. ఓ సారి ఈవీఎంలను నిందిస్తారు. మరోసారి అదనపు ఓటర్లను చేర్చారని అంటారు. మరోసారి ఫేక్ ఓటర్లు, చనిపోయిన వారు ఓట్లు వినియోగించుకున్నారని అంటారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ రాను రాను పటిష్టంగా మారుతోంది. ఓటు వేసే ప్రతి ఓటర్ను ఏజెంట్లు చెక్ చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ఒక్కరి చేతిలో ఉండదు. లక్షల మంది పాల్గొంటూ ఉంటారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టి రాజకీయం చేయడం ద్వారా కాంగ్రెస్ కు లాభమేం ఉండదు.. తప్పులు చేస్తే ప్రజల ముందు పెడితేనే ప్రయోజనం ఉంటుంది.