కేసీఆర్‌ను అరెస్టు చేస్తారని విస్తృతంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేస్తామని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన ఏమైనా బయట స్వేచ్చగా తిరుగుతున్నారా అన్న అర్థంలో రేవంత్ మాట్లాడారు. ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడని.. జైలుకు, ఫామ్ హౌస్‌కు పెద్ద తేడా ఏముందని రేవంత్ ప్రశ్నించారు. ఆయనను జైల్లో వేయాల్సిన అవసరం లేదని రేవంత్ ఫిక్సయ్యారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అని తేల్చేశారు.
రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌తో బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాస్త ధైర్యం వస్తుంది. కేసీఆర్ ను అరెస్టు చేసిన తర్వాత ప్రజల్లో స్పందన లేకపోతే ఇంత కాలం తెలంగాణ జాతిపితగా తెచ్చుకున్న పేరు.. చేసుకుంటున్న ప్రచారం అంతా మట్టికొట్టుకుపోతుంది. ఇప్పటికే ఓ సారి ఓటమితో.. అసెంబ్లీలో రేవంత్ ఎదుటకు రాలేని పరిస్థితి ఉంది. అయితే ఒక వేళ కేసీఆర్ ను అరెస్టు చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని..అది విజయానికి దోహదపడుతుందని కొంత మంది బీఆర్ఎస్ నేతుల ఆశలు పెట్టుకున్నారు.
కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అరెస్టు చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదన్న అంచనాకు వచ్చారు. రాజకీయాల్లో అధికారం ఉందని ఈగోలు తీర్చుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో రేవంత్ కు బాగా అర్థమయింది. ఏపీలో వైఎస్ జగన్ అధికారం దొరికిందని ఐదు సంవత్సరాల పాటు రాజకీయ వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. రేవంత్ అలాంటి రాజకీయ కక్షల జోలికి వెళ్లకుండా అవకాశం వచ్చినా సరే అరెస్టుల వరకూ కేసులు వెళ్లకుండా వాళ్లు తప్పు చేశారని ప్రజల ముందు ఉంచేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.