ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్సీ రిటైర్మెంట్ కు వారం రోజులు ఉందనగా కోట్లలో లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. ఆయన అంతకు ముందు రెండు సార్లు దొరికిపోయారు. అయినా మరోసారి కీలక పొజిషన్ లోకి వచ్చి లంచాలు తీసుకుంటున్నారు. దొరికాడు కాబట్టి ఆయన ఒక్కడు దొంగ. కానీ దొరకని వాళ్ల సంగతేమిటి ?. వారంతా నిజాయితీ పరులైపోతారా ?. ఇలాంటి వారిపై యుద్ధం ప్రకటించాల్సి ఉంది. ప్రజల్ని ఇలాంటి పీడకుల నుంచి రక్షించాల్సి ఉంది.
ఎవరు పట్టుబడినా వందల కోట్ల ఆస్తులు !
ఇటీవల తెలంగాణలో కాళేశ్వరం నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారుల ఇళ్లల్లో సోదాలు చేస్తే .. బహిరంగ మార్కెట్లో ఒక్కొక్కరికి వెయ్యికోట్ల కు తక్కువ కానంత విలువైన ఆస్తులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఓ ఫ్యూన్ కు వంద కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఏపీలో స్వయంగా తన కార్యాలయంలోనే పాతిక లక్షలు లంచం తీసుకుంటూ ఈఎన్సీ దొరికాడు. గతంలో ఎంతో మంది అధికారులు వందల కోట్ల అక్రమాస్తులతో పట్టుబడ్డారు. ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్న వారి ఆస్తులను ఆరా తీస్తే.. ఆ ఆస్తులు ఎలా వచ్చాయో కనిపెట్టడం ఏ మాత్రం కష్టం కాదు.
అవినీతి పరుల కోసం జల్లెడ పట్టాలి !
ఉద్యోగులు అవినీతికి పాల్పడటం అత్యంత తీవ్రమైన విషయం. వారు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నారు. ప్రజల కోసం చేయాల్సిన పనులకు మళ్లీ వారి దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. ప్రజా ధనంతో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు క్వాలిటీ లేకుండా కట్టేందుకు కారణం అవుతున్నారు. ఇదంతా ప్రజాద్రోహమే అవుతుంది. ఇలాంటి వారు ప్రతి వ్యవస్థలోనూ ఉన్నారు. వీరందర్నీ పట్టుకునేందుకు ఏసీబీ ప్రత్యేకంగా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం పడింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేవా అన్నది కాకుండా.. సర్వీసులో.. డబ్బులు సంపాదించుకునే ప్రతీ పోస్టులో పని చేసిన వారందరి ఆస్తులపై ఆరా తీసి అక్రమాస్తులు వెలికి తీయాల్సిందే.
లంచం తీసుకుంటూ దొరికితే ఎందుకు క్షమిస్తున్నారు ?
ఉద్యోగానికి ద్రోహం చేసి లంచం తీసుకుంటూ దొరికితే.. చట్టాలు ఉపేక్షిస్తున్నాయి. మహా అయితే కొన్ని రోజులు పక్కన పెట్టి మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారు. మళ్లీ వారు సంపాదనలో పడిపోతున్నారు. ఇలాంటి చట్టాలను బలోపేతం చేయాలి. లంచాలు తీసుకుంటే వెంటనే డిస్మిస్ చేసేసే విధంగా చర్యలు ఉండాలి. అప్పుడే కాస్త భయపడతారు. భయం లేనప్పుడు సంపాదించుకుంటే తప్పేమిటని వాదిస్తారు. ఇలాంటి వారిని ఉపేక్షించడం వ్యవస్థల తప్పే.. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ తప్పు.