మాట్లాడితే టారిఫ్‌లు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలను భయపెడుతున్నారు. కాదు భయపెడదామనుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ట్రంప్‌తో ఎలా ఆడాలో అలా ఆడుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.
ఇటీవల అమెరికా ఓ ఆఫర్ ప్రకటించింది. వెనుజులా అధ్యక్షుడ్ని పట్టి తీసుకొచ్చి ఇస్తే 50 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడ్ని అమెరికా నేరస్తుడిగా.. డ్రగ్ ట్రాఫికర్‌గా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ ట్రాఫికర్లలో ఒకరిగా ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అమెరికాలోకి అతను పెద్ద ఎత్తున ఫెంటానిల్-లేస్డ్ కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్నాడని.. ఆ గ్యాంగ్ కు అతనే లీడర్ అని అమెరికా నమ్ముతోంది.
2020లో, ట్రంప్ మొదటి పరిపాలన సమయంలో, మదురోపై మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో నార్కో-టెర్రరిజం మరియు కొకైన్ దిగుమతి కుట్ర ఆరోపణలతో కేసు పెట్ట్టారు. అప్పుడు అతని అరెస్ట్ కోసం 15 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని 50 మిలియన్ డాలర్లు చేశారు. ఒసామా బిన్ లాడెన్ కు కూడా ఇంతగా బౌంటీ ప్రకటించలేదు. అదే సమయంలో మదురో 2024 ఎన్నికలలో మోసపూరితంగా తిరిగి ఎన్నికైనట్లు అమెరికా అరోపిస్తోంది. అంతే కాదు అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్‌ను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా గుర్తించాయి. కానీ అసలు అధ్యక్షుడు మదురోనే.
వెనిజులా పై ట్రంప్ విధించని ఆంక్షలు లేవు. అయినా వెనిజులా అధ్యక్షుడు పట్టించుకోలేదు. పైగా ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్ ను బయటకు తెచ్చిన వారికి తాము పాతిక మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇది కూడా వైరల్ అవుతోంది. దేశాలతో ఎలా వ్యవహరించకూడదో.. ట్రంప్ ను చూసి ఇతర దేశాల అధ్యక్షులు నేర్చుకునేలా ఉంది.