కార్తీ ‘ఖైదీ’ విడుదలై ఏడేళ్లు అయిపోయింది. సినిమా ముందు దానిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ… ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించింది. ‘ఖైదీ 2’ మరుసటి ఏడాదే మొదలవ్వాలి. కానీ.. రకరకాల కారణాల వల్ల ఆగుతూ వచ్చింది. ఆ తరవాత లోకేష్ తీసిన ప్రతీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టే. పెద్ద పెద్ద స్టార్లంతా తనతో పని చేయడానికి ఉత్సాహం చూపించారు. అలా.. ‘ఖైదీ 2’ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ‘కూలీ’ రూపంలో మరో మాస్, యాక్షన్ ఫీస్ట్ ని వదలబోతున్నాడు లోకేష్ కనగరాజ్. రేపే `కూలీ` రిలీజ్ అవుతోంది. ఆ వెంటనే ‘ఖైదీ 2’ని మొదలెట్టేస్తాడు.
‘ఖైదీ 2’కి సంబంధించిన స్క్రిప్టు ఎప్పుడే పూర్తయిపోయింది. ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. ఢిల్లీ (కార్తి) అనే పాత్ర జైలు నుంచి విడుదలైన రోజు ఏం జరిగిందన్నదే ఖైదీ కథ. అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ తో ‘ఖైదీ 2’ మొదలు కానుంది. ‘ఖైదీ’లో కార్తి ఒక్కడే స్టార్. అయితే ఈసారి మాత్రం చాలామంది స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘ఖైదీ’ తరవాత లోకేష్ తీసిన ప్రతీ సినిమాలోనూ లెక్కకు మించిన స్టార్లు దర్శనమిస్తారు. విక్రమ్, లియో, ఇప్పుడు కూలీ సినిమాల్ని స్టార్లతో నింపేశాడు. ‘ఖైదీ 2’ కూడా ఇదే టెంప్లేట్ తో తీయబోతున్నాడని తెలుస్తోంది. విక్రమ్, కూలీలో కనిపించిన పాత్రలు కూడా ‘ఖైదీ’లో దర్శనమివ్వబోతున్నాయి. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో ఉండే ముఖ్యమైన పాత్రలన్నీ ఒకేసారి తెరపైకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలే జరగబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర దాదాపు ఫిక్సయ్యిందని సమాచారం. ఈసారి ఆ ఛాన్స్ సమంతకు దక్కబోతోందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఓ భారీ ప్రాజెక్ట్ సమంతకు చిక్కి చాలా కాలం అయ్యింది. ‘ఖైదీ 2’తో తనకు అలాంటి అవకాశమే దక్కిందనుకోవాలి.