“నీవు ఏమి చేస్తావో నీకు అదే జరుగుతుంది” అని భగవద్గీతలో కర్మ సిద్ధాంతం చెబుతుంది. ” ఇతరులను నీవు ఏమి చేయాలనుకుంటావో.. ఎలా చేయాలని కోరుకుంటావో నీకు కూడా అలా జరుగుతుంది” అని బైబిల్లో మాథ్యూ వాక్యం ఉంటుంది. దీనిని “గోల్డెన్ రూల్” అని కూడా పిలుస్తారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను రోజూ నిద్రపోయే ముందు బైబిల్ చదువుతానని కొన్ని ఇంటర్యూల్లో చెప్పారు. నిజంగా ఆయన మనసు పెట్టి చదివి ఉన్నట్లయితే మాథ్యూ 7:12 ఖచ్చితంగా గుర్తు ఉండే ఉంటుంది. లేకపోతే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక తర్వాత ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు చేసిన పరిపాలనలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థను అయినా సరిగ్గా నడిపించారా ? అని ఆయన సమీక్ష చేసుకుంటే మాథ్యూ చెప్పిన సూక్తి గుర్తుకు వస్తుంది. తాను చేసివన్నీ తనకు తిరిగి వస్తున్నాయని అర్థమవుతుంది.
చేసిన పాపాలకు ఫలితాలే ఇవన్నీ !
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికనే తీసుకుంటే రిగ్గింగ్ చేసి గెలిచారని గగ్గోలు పెడుతున్నారు. దానికి సోషల్ మీడియాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కౌంటర్ ఇచ్చారు. ఓడిపోయిన వాళ్లు ఏదేదో మాట్లాడుతూంటారు.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని ఆయన తేల్చేశారు. ఇక వైసీపీ వాళ్లు మాట్లాడటానికి ఏముంటుంది ? . జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కటంటే ఒక్క ఎన్నిక సక్రమంగా జరిగిందని గుండెల మీద చేయి వేసుకుని చెప్పలేరు. చివరికి 2021లో కడప జిల్లా పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 52 ఉంటే అందులో 49 ఏకగ్రీవం అయ్యాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది?. కత్తులు కటార్లతో ఇళ్ల మీద పడి.. ఆస్తులు ధ్వంసం చేస్తామని, ఇళ్లలో ఆడవాళ్ల మాన, ప్రాణాలతో ఆడుకుంటామని బెదిరించి ఎవర్నీ పోటీ చేయకుండా చేయడం వల్లనే ఈ ఏకగ్రీవాలు జరిగాయి. ఒక్క కడపలోనే కాదు.. మాచర్లలోనే నడి రోడ్డుపై ప్రజా ప్రతినిధులపైనే హత్యాయత్నం చేశారు. అక్కడ ఎవర్నీ నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 126 జడ్పీటీసీ ఏకగ్రీవం అయ్యాయి. ఎంపీటీసీలు 2362 ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో 553 ఎపీటీ స్థానానాలకు 450కిపైగా పోటీ లేకుండా తమ పార్టీ వారినే ప్రతినిధులుగా ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను ఇంత దారుణంగా పరిహసించిన నేత భారత స్వాతంత్ర్య చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ప్రజలకు ఓట్లు వేసే హక్కును తీసి వేస్తే వారు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు జరిగినప్పుడు.. గెలుపునకు ఢోకా లేదని తెలిసి కూడా రికార్డు స్థాయి మెజార్టీ కావాలని..వేల మంది దొంగఓటర్లను రంగంలోకి దింపారు. బద్వేలు ఉపఎన్నిక సమయంలోనూ అంతే. మేకపాటి గౌతంరెడ్డి చనిపోయినప్పుడూ .. ఇతర పార్టీలు పోటీ పెట్టకపోయినా అంతే. అవసరం లేకపోయినా అధికారం ఉందని వ్యవస్థల్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసిన పాపం.. ఇప్పుడు వెంటాడుతోంది.
మానసికంగా బ్యాలెన్స్ కోల్పోయిన లక్షణాలు
పులివెందులలో పరువు పోతుందని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న ఎవరికైనా బైబిల్ చదివేవారు అలా మాట్లాడరని అనుకుంటారు. కానీ బైబిల్ చదివే జగన్ అలా మాట్లాడారు. ఎందుకంటే చదివిన దాంట్లో ఆయన రివర్స్ అర్థం చేసుకుని ఉంటారు. తాను చేసింది మాత్రమే కరెక్ట్..ఇతరులు ఎవరు చేసినా తప్పే అనే భావన ఆయనకు ఎక్కడైనా వచ్చి ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు ఎదురవుతున్న పరిణామాలు.. అన్నీ గతంలో చేసిన దానికి ప్రతిఫలాలే అని అంచనా వేయలేకపోతున్నారు. ఉదాహరణకు పోలీసుల్ని దుర్వినియోగం చేస్తున్నారు.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజంగా అలా జరిగింది తన హయాంలోనే కదా అనే ఆలోచనకు ఆయన రాలేకపోతున్నారు. వస్తే తాను చేసిన పని సిగ్గుపడి ఉండేవారు. జగన్ రెడ్డి హయాంలో పోలీసులు ప్రైవేటు సైన్యం మాదిరిగా చెలరేగిపోయారు. ముంబై నుంచి ఓ హీరోయిన్ ను కిడ్నాప్ చేసుకు వచ్చి బెదిరించి.. చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. జగన్ రెడ్డి ఇలా విచ్చలవిడిగా పోలీసు వ్యవస్థను క్రిమినల్ మైండ్ సెట్ తో క్రిమినల్ పనులకు వాడుకున్నందునే ఇవాళ వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నారు. డీజీ స్థాయి అధికారి జైలుకెళ్లాల్సి వచ్చింది. మరో డీజీ స్థాయి అధికారి జైలుకెళ్లబోతున్నాడు. ప్రభుత్వం దయదల్చి.. సస్పెన్షన్ తోనే సరిపెట్టడంతో చాలా మంది పోలీసు అధికారులు జైలు చూడకుండా గడుపుతున్నారు. వీరంతా ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పోలీసులు ఎవరైనా చట్ట విరుద్ధంగా ఫలానా పని చేశారని చెప్పగలరా ?. పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు అయిన వారిని ఎప్పుడూ రాత్రికి రాత్రి అరెస్టు చేయలేదు. సుప్రీంకోర్టు వరకూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకున్న తర్వాతనే అరెస్టు చేశారు. వారు నేరం చేశారని అన్ని వ్యవస్థలకు స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాతనే అరెస్టయ్యారు.
అధికారం శాశ్వతమనే భావనతో ఘోరమైన తప్పులు
జగన్ రెడ్డి తనకు అధికారం అందిందని అదే పనిగా ప్రత్యర్థుల్ని వేధించడానికి ఆయుధంగా మార్చుకున్నారు. మైనింగ్ వ్యాపారులకు వందల కోట్ల పైన్ వేశారు.తన పార్టీలో చేరకపోతే వ్యాపారాలు ధ్వంసం చేయించారు. వారాంతంలో ఇళ్లు , వ్యాపారాలు కూలగొట్టించారు. ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకుని లిక్కర్ స్కాం చేశారు. అన్నీ కళ్ల ముందు ఉన్న నేరాలు. అయినా ఇప్పుడు తనకు ఎదురవుతున్న ప్రతి ఘటన.. తాను చేసిన కర్మకు ప్రతి కర్మ అని ఊహించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నూమిన్నూ కానరాకుండా చేసిన పరిపాలనలో తెలుగు360 కూడా ఎన్నో సార్లు హెచ్చరికలు జారీ చేసింది. వ్యవస్థను మీరు రక్షిస్తే..తర్వాత వ్యవస్థలు మిమ్మల్ని రక్షిస్తాయి.. అధికారంలో ఉన్నాం కదా అని ఆ వ్యవస్థల్ని నిలువునా నరికేస్తే.. తర్వాత మీకు రక్షణ ఉండదు. గతంలో మీరు చేశారు కదా అని సానుభూతి కూడా చూపించవాళ్లు ఉండరని పదుల సార్లు హెచ్చరించాం. కానీ అప్పటికే తమకు అధికారం శాశ్వతం అన్న భ్రమలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే భ్రమల్లో ఉన్నారు. మళ్లీ గెలుస్తామని కలలు కంటూ.. మళ్లీ వచ్చాక ఎవర్ని కొట్టాలి.. ఎవర్ని నరకాలి అనే లెక్కలు వేస్తున్నారు. కానీ తాను చేసిన దానికే తను ఇప్పుడు అనుభవిస్తున్నానన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉన్నారు.
దేవుడి స్క్రిప్ట్ అర్థం చేసుకోలేరా ?
జగన్ రెడ్డికి తాను చేసిన ప్రతి అడ్డగోలు పనికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని హెచ్చరించారు. ఆయన ఇంటి ముందు ఉన్న పోలీస్ పోస్ట్ ను కూడా తీసేస్తారని ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని బతిమాలుకుంటున్నారు. కోర్టుకు వెళ్లాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మారాం చేస్తున్నారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను జగన్ గుర్తుకు చేసుకుంటే.. దేవుడే తనకు ఈ దుస్థితి తెచ్చాడని గట్టిగా నమ్మి ఉండేవారు. దేవుడు తనకు విధించిన శిక్షగా భావించి చిరునవ్వుతో శిక్షను అనుభవిస్తూ.. తన తప్పులను దిద్దుకునేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోవడం లేదు. దేవుడు తనను శిక్షిస్తున్నాడని అసుల అసలు అనుకోవడం లేదు. తాను చేసిన తప్పులకు తనకు శిక్షలు పడుతున్నాయని అసలు అనుకోవడం లేదు. తనలో ఆత్మపరిశీలన శక్తి కొంచెం ఉన్నా కూడా.. గతంలో తాను చేసినవే ఇప్పుడు రివర్స్ లో తనకు ఎందుకు ఎదురు వస్తున్నాయో ఒక్క సారి అంటే.. ఒక్క సారి అయినా మననం చేసుకుని ఉండేవారు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నప్పుడో.. రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుతున్నప్పుడో తనకు ఈ జ్ఞానం వచ్చి ఉండేది. కానీ తనను ఓడించాడు కాబట్టి దేవుడు కూడా చెడ్డవాడేనని ఫిక్సయ్యారేమో కానీ.. ఇప్పుడు పైన దేవుడు చూస్తూంటాడని ఒక్క మాట మాట్లాడటం లేదు. నిజంగా ఆయనకు మనస్సాక్షి అనేది ఉన్నట్లయితే.. చంద్రబాబు వయసు గురించి, ప్రాణాల గురించి మాట్లాడి ఉండేవారు కాదు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు వయసు గురించి, ఆయన ప్రాణాల గురించి మాట్లాడేవారు. ఇప్పటికీ మారలేదు. మనిషి అనే లక్షణాలు ఉన్న ఎవరైనా సరే.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా చేసుకుని వారి చావును కోరుకోరు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప.
జగన్ నీడ్స్ రీహాబిలిటేషన్
జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రిహాబిలిటేషన్ చాలా అవసరం. ఆయన ఇప్పటి వరకూ ఏం కోల్పోయారో.. ఎందుకు కోల్పోయారో.. ఏం సాధించారో ఆయనకు వివరంగా అర్థమయ్యేలా చెప్పగలిగే రిహాబిలిటేషన్ అవసరం. ఆయన 2019లో గెలిచానని అనుకుంటున్నారు. కానీ అది ఆయన అతి పెద్ద ఓటమి. ఐదు సంవత్సరాల కాలంలో ఆయన అన్నీ కోల్పోయారు. తల్లిని కోల్పోయారు.. చెల్లిని కోల్పోయారు. బంధువుల్ని కోల్పోయారు. నమ్మకమైన మిత్రుల్ని అంటే మంగలి కృష్ణ లాంటి వారిని కోల్పోయారు. ప్రజాభిమానం కోల్పోయారు. అంతిమంగా ఇవన్నీ కోల్పోవడానికి కారణం అయిన అధికారం కూడా కోల్పోయారు. కానీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కనీసం ఇప్పటికైనా మారు మనసు పొంది తనను తాను సన్మార్గంలో నడిపించుకునేందుకు ప్రయత్నాలు చేసే ఆలోచనకు వస్తే..కోల్పోయిన వాటిలో కొన్నింటినీ కనీసం మనశ్శాంతిని అయినా పొందగరు. అది కూడా పూర్తిగా తాను కోల్పోయింది ఏమిటి అన్న అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తాను చేసిన తప్పులేమిటో.. వాటికి తాను అనుభవిస్తున్న ప్రతిఫలం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన మనసు మార్చుకుని పూర్తిగా మారిపోయినా.. గతంలో చేసిన పనులకు ప్రతిఫలాలు అనుభవించకుండా ఉండలేరు. కానీ తాను చేసినవే తనకు జరుగుతున్నాయన్న నమ్మకాన్ని ధృడంగా పెంచుకుని.. వాటిని శిక్షగా కాకుండా.. దేవుని ఆదేశంగా భావించి భరిస్తారు. ఇప్పటికిప్పుడు జగన్ స్వయం రిహాబిలిటేషన్ వల్ల వచ్చే ప్రయోజనం ఇదే. లేకపోతే.. జరగబోయే ప్రతి పరిణామాన్ని నిరంతరం తల్చుకుంటూ.. మానసికంగా కుంగి పోతూ ఉంటారు. ఇతరుల్ని తిట్టుకుంటూ.. చావు కోరుకుంటూ.. పిల్లి శాపాలు పెట్టుకుంటూ బతకాల్సి వస్తుంది. అది బతుకును దుర్భరం చేస్తుంది. భవిష్యత్ లేకుండా చేస్తుంది. అంతిమంగా ఎవరికీ కాకుండా చేస్తుంది. చాయిస్ జగన్ చేతుల్లోనే ఉంది.